జ‌గ‌న్ చేతికి బోస్ట‌న్ నివేదిక‌..ఆ రోజే అస‌లు నిర్ణ‌యం

Update: 2020-01-03 13:41 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మూడు రాజధానుల ఏర్పాటులో కీల‌క ఘ‌ట్టానికి అధికారిక ప్ర‌క్రియ‌కు ముహుర్తం ఖ‌రారైంది. ఏపీ రాజధాని మీద ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏపీ సీఎం జగన్‌ కు తమ అధ్యయన నివేదిక సమర్పించింది. ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని కలిసిన సంస్థ ప్రతినిధులు ఈ రిపోర్టును అందజేశారు. దేశంలో బహుళ రాజధానులున్న రాష్ట్రాలపై అధ్యయనం చేసిన బీసీజీ కమిటీ.. ఆయా రాష్ట్రాల అభివృద్ధిని నివేదికలో వివరించారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణను సైతం నివేదికలో ప్రస్తావించారు. మూడు రాజ‌ధానుల ఏర్పాటుతోనే...అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో, జ‌న‌వ‌రి 6వ తేదీన జ‌ర‌గ‌నున్న హైప‌వ‌ర్ క‌మిటీపై అంద‌రి దృష్టి ప‌డింది.

ఏపీలో రాజ‌ధాని ఏర్పాటు అంశంపై నిర్ణ‌యం తీసుకోవ‌డంలో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న మేర‌కు గ‌త ఏడాది డిసెంబర్ 21న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ మధ్యంతర నివేదికను అందజేసింది. కొత్తగా రాజధానిని నిర్మించడం కంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరంలో రాజధానిని ఏర్పాటు చేయడం ఉత్తమమని తద్వారా సత్వర పురోగతి సాధ్యం అవుతుందని మధ్యంతర నివేదికలో పేర్కొంది. దీనికి కొనసాగింపుగా స్ట్రాటజీ ఫర్ బ్యాలెన్స్ డ్ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్-బిగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్  పేరుతో బోస్టన్ రిపోర్ట్ అంద‌జేసింది. అయితే, దీనిపై అధికారికంగా ఇంకా స‌మాచారం వెలువ‌డ‌లేన‌ప్ప‌టికీ....జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగానే బీసీజీ రిపోర్ట్ ఉందని స‌మాచారం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సత్వరంగా ఆర్థికాభివృద్ధి సాధించాలంటే బహుళ రాజధానుల ఆవ‌స‌రం అని పేర్కొంటూ...ఇందుకు  తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావిస్తూ నివేదిక‌ను బోస్ట‌న్ రూపొందించిన‌ట్లు స‌మాచారం. దీంతోపాటుగా, అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాన్ని నివేదికలో సూచించిందని తెలుస్తోంది. సత్వర ఫలితాల సాధనకు ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని బీసీజీ నివేదికలో కూలంకషంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.  వ్యవసాయ, పర్యాటక, పరిశ్రమ - మత్స్య రంగాల అభివృద్ధిని నివేదిలో పేర్కొన్న‌ట్లు స‌మాచారం. జీఎన్ రావు క‌మిటీ, బోస్ట‌న్ క‌మిటీలు ఇచ్చిన నివేదికలను పరిశీలించి తుది రిపోర్టు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన‌ హైపవర్ కమిటీ ఈనెల 6న సమావేశం కానుంది. దీంతో ఈ క‌మిటీ నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కొంది.
 
   

Tags:    

Similar News