భోగాపురం..బాబు జేబుకు భ‌రోసా ఇచ్చిందా?

Update: 2018-08-20 16:54 GMT
భోగాపురం ఇంటర్ నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ టెండర్ విష‌యంలో ఆస‌క్తిక‌ర రాజకీయాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నా దాన్ని కాద‌ని అదానీ గ్రూప్‌ న‌కు కేటాయించ‌డం అనుమాస్ప‌దంగా మారింది. అదాన ప్ర‌దాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి స‌న్నిహితుడు అయిన నేప‌థ్యంలో బాబు బీజేపీ పేరుకు మాత్ర‌మే దూర‌మ‌య్యార‌ని - ఆర్థిక అవ‌స‌రాల విష‌యంలో ఆయ‌న ఇంకా త‌న దోస్తీని కొన‌సాగిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

తాజాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ భోగాపురం ఎయిర్‌ పోర్టు టెండర్‌ రద్దు అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయ‌న్నారు. టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు కేంద్రంలో పౌరవిమానయాన మంత్రిగా ఉన్న సమయంలో భోగాపురంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నిర్మించేందుకు ఎయిర్‌ పోర్టు అధికారిటీ ఆఫ్‌ ఇండియా గతంలో అశోక్‌ గజపతిరాజు శాఖ సంస్థ టెండర్‌ వేసిందన్నారు. ఎక్కువ శాతం వాటా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పినా.. ఆ టెండర్‌ ను ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టి దోపిడీ చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు, అశోక్‌ గజపతిరాజు కలిసి టెండర్‌ రద్దు చేశారన్నారు. ఆ నేపథ్యంలోనే తప్పు జరుగుతుందని వైఎస్ ఆర్‌ సీపీ ప్రధానికి లేఖ రాసిందని - దానికి సాంకేతిక పరిజ్ఞానం లేదని అప్పటి మంత్రి అశోక్‌ గజపతిరాజు చెప్పారన్నారు. కాగా ప్రస్తుతం ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అవినీతి కోసం టెండర్‌ రద్దు చేశారనే మాటలను కూడా పొందుపరిచిందని ఈ నేప‌థ్యంలో టెండ‌ర్ విష‌య‌మై సీబీఐ ఎంక్వైరీ వేయాలని బొత్స డిమాండ్‌ చేశారు.

భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నా...ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామని చెప్పినా ఆ సంస్థ నుంచి కమీషన్లు దండుకునే వీలు ఉండదని మొత్తానికి టెండర్లనే రద్దు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ ప్రకారమే తాజాగా ఆహ్వానించిన కొత్త బిడ్లలోనూ ఏఏఐ పాల్గొనేందుకు వీలు లేకుండా...ఏ నిబంధన విధిస్తే ఏఏఐను టెండర్లలో పాల్గొనకుండా నిలువరించవచ్చో...ఆ నిబంధనను రూపొందించి మరీ రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తెచ్చిందంటున్నారు.మూడు దశల్లో రూ. 4,209 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించనున్న ఈ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ ప్రాజెక్ట్ లో వందల కోట్లు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News