లెజెండ్లకే లెజెండ్.. వెళ్లిపోయాడు

Update: 2016-06-04 09:35 GMT
క్రికెట్లో గ్రేటెస్ట్ ఆటగాడు ఎవరంటే చెప్పడం కష్టం.. కొందరేమో సచిన్ టెండూల్కర్ అంటారు. ఇంకొందరు డాన్ బ్రాడ్ మన్ అంటారు. మరికొందరు లారా.. రిచర్డ్స్ పేర్లు ఎత్తుతారు. ఇప్పుడు కోహ్లి గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇక ఫుట్ బాల్ విషయానికొస్తే పీలే.. మెస్సి.. రొనాల్డో లాంటి ఆటగాళ్ల గురించి చర్చ జరుగుతుంది. కానీ ఏకాభిప్రాయం మాత్రం కుదరదు. టెన్నిస్ సహా చాలా క్రీడల్లో సైతం ఇంతే.

కానీ బాక్సింగ్ లో ‘ది బెస్ట్’ ఎవరు అని ఆ క్రీడ మీద అవగాహన ఉన్న ఎవరినైనా అడగండి. మరో మాట లేకుండా మహ్మద్ అలీ పేరు చెప్పేస్తారు. అసలు బాక్సింగ్ గురించి తెలియని వాళ్లయినా సరే.. మహ్మద్ అలీనే గ్రేటెస్ట్ బాక్సర్ అనేస్తారు. ఎందుకంటే అతడు అంత గొప్ప బాక్సర్. కేవలం బాక్సింగ్ తోనే కాదు.. తన వ్యక్తిత్వం.. పోరాట స్ఫూర్తితోనూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుని గ్రేటెస్ట్ ఎవర్ బాక్సర్ గా.. మొత్తం క్రీడా రంగంలోనే అరుదైన ఆణిముత్యంగా పేరు తెచ్చుకున్న ఘనుడు మహ్మద్ అలీ. లెజెండ్లకే లెజెండ్ అయిన ఈ బాక్సింగ్ గ్రేట్.. ఇవాళ తుది శ్వాస విడిచాడు.

శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శనివారం) తుది శ్వాస విడిచాడు. గత కొన్ని రోజులుగా మహ్మద్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన బతికే బతికే అవకాశాలు చాలా తక్కువని ముందు రోజే వైద్యులు చెప్పేశారు. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చి.. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ గా అలీ ఎదిగిన తీరు అబ్బుర పరిచేదే. 1942 జనవరి 17న కెంటకీలోని లూయిస్ విల్లేలో జన్మించిన అలీ.. 12 ఏళ్లకే బాక్సింగ్ ను కెరీర్ గా ఎంచుకుని.. 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడు.

1960ల్లో అతను ప్రపంచ బాక్సింగ్ ను శాసించాడు. రికార్డు స్థాయిలో 56 విజయాలు సాధించి.. కేవలం ఐదు బౌట్లలో మాత్రమే ఓడిన అలీ.. మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్ సాధించాడు. 1981లో రిటైరైన అలీ.. నాలుగు వివాహాలు చేసుకున్నారు. మొత్తం తొమ్మిదిమంది సంతానం. అలీ కూతురు లైలా కూడా తండ్రి బాటలోనే బాక్సర్ అయింది. అలీ విజయ గాథ ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అలీపై కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. వియత్నాంపై అమెరికా యుద్ధానికి నిరసనగా ఆయన ఇస్లాం మతం స్వీకరించడం విశేషం. అలీ మూడు దశాబ్దాలుగా పార్కిన్ సన్స్ అనే వ్యాధితో బాధపడుతూ.. కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నాడు.
Tags:    

Similar News