ఉదయం ప్రెస్ మీట్.. సాయంత్రం అరెస్టు.. అర్థరాత్రి బెయిల్

Update: 2022-01-25 04:14 GMT
టీడీపీ అధినేత చంద్రబాబును నోటికి వచ్చినట్లుగా బండ బూతులు తిడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైనాన్ని వెల్లడిస్తూ.. మంత్రి కొడాలి నానిపై తీవ్రంగా విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ప్రెస్ మీట్ లో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పైన బుద్దా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఉదయం 11 గంటల వేళలో ప్రెస్ మీట్ పెట్టి మంత్రి కొడాలి నానిపైనా.. డీజీపీ పైనా ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో సాయంత్రానికి ఆయన్ను అరెస్టు చేయటం కలకలాన్ని రేపింది. తీవ్రమైన రాజకీయ అలజడికి కారణం కావటంతో పాటు.. విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవటం ఏమిటంటూ పోలీసుల తీరుపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు ఆందోళన నిర్వహించారు. ఎట్టకేలకు తాము అనుకున్నట్లే బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అర్థరాత్రి 11.15 గంటల సమయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. మొత్తంగా పన్నెండు గంటల పాటు సాగిన ఈ వ్యవహారం ఏపీలో మరోసారి రాజకీయ కలకలానికి కారణమైంది. ప్రెస్ మీట్ లో బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలకు వాయు వేగంతో రియాక్టు అయిన పోలీసుల తీరును టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

తమ పార్టీ అధినేతను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని నోటికి వచ్చినట్లుగా తిట్టినప్పుడు ఇదే పోలీసులు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. గుడివాడలో క్యాసినో నిర్వహించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిలదీస్తున్నారు.  ప్రెస్ మీట్ లో బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గారావు కంప్లైంట్ మేరకు బుద్దా వెంకన్నపై ఐపీసీ సెక్షన్లు 153ఏ, సెక్షన్ 506,  505(2), రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లను చూస్తే..

-  సెక్షన్ 153ఏ.. రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు

-  సెక్షన్ 506.. భయోత్పాతం స్రష్టించినందుకు

- సెక్షన్ 505 (2).. మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు
పోలీసులు ఇంత వేగంగా రియాక్టు అయి బుద్ధా వెంకన్నను అరెస్టు చేసేంతగా ఆయనేం మాట్లాడారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి కొడాలి నానితో పాటు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి ఆయనేం అన్నారన్నది చూస్తే..

-  మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లోనిర్వహించిన క్యాసినో వ్యవహారంలో రూ.250 కోట్లు చేతులు మారాయి. ఈ వ్యవహారంలో డీజీపీ వాటా ఎంత? డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ. డీజీపీ తీరు బాగోలేదని పోలీసుల శాఖలోని ఆయన స్థాయి అధికారులే వాపోతున్నారు. దేశంలో మరే డీజీపీ ఇలా వ్యవహరించటం లేదు.

- మరో ఏడాది.. ఏడాదిన్నర తర్వాత డీజీపీ గౌతమ్ సవాంగ్ రిటైర్ అవుతారు. తర్వాత వచ్చే టీడీపీ ప్రభుత్వంలో ఆయన రాష్ట్రంలో ఉన్నా.. లేకున్నా.. ఎక్కడ ఉన్నా సరే ఆయన్ను మాత్రం వదిలేది లేదు. మా సహనం నశించింది. ఇక.. చేసేదేదో బయటకు చెప్పేస్తాం. లోపల దాచుకునేది ఏమీ లేదు.

- మంత్రి కొడాలి నానిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయటం లేదు. క్యాసినో నిర్వహించినట్లు సాక్ష్యాలున్నాయి. అయినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?

- కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు. అలాంటి వారికి టికెట్లు ఇవ్వటం చంద్రబాబు తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. పార్టీలో ఉన్నప్పుడు సెటైర్లు వేస్తే.. పోనీలే అని ఊరుకున్నారు.

-  డెబ్బై ఏళ్ల వయసున్న చంద్రబాబును నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నా కొడకా అంటూ తిడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టారని పట్టాభిని అరెస్టు చేశారు. మరి.. చంద్రబాబును అంతలా అంటుంటే పోలీసులు ఎందుకు స్పందించరు?

-  నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా చంద్రబాబు ఇంటికి రా. చంద్రబాబు ఇంటి గేటు తాకగలవా? తాకిన తర్వాత తిరిగి వెళ్లగలవా?

-  నాని చరిత్ర గుడివాడలో అందరికి తెలుసు. వర్త రామయ్య పోలీసు అధికారిగా ఉన్నప్పుడు అరెస్టు చేశారని మర్చిపోయారా? గుడివాడ కల్చర్ ను చెడగొట్టవ్.

-  షర్మిల ఏపీలో పార్టీ పెడితే మొదట మారేది కొడాలి నానినే. అప్పుడు జగన్ ను కూడా దూషిస్తారు. 2024లో ఓడాక నీ పరిస్థితేమిటో తెలుస్తుంది. నీవు మాట్లాడే భాషేంటి?

ఉదయం 11 గంటల వేళలో ప్రెస్ మీట్ పెట్టిన బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేయటం.. దానిపై వైసీపీ నేత ఫిర్యాదు చేసినంతనే పోలీసులు రియాక్టు కావటం జరిగిపోయాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బుద్దా నివాసానికి వెళ్లిన పోలీసులు.. ఆయన్ను విచారణనకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. నోటీసు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని బుద్ధా ప్రశ్నించారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు పలువురు బుద్ధా ఇంటికి చేరుకున్నారు.

చివరకు.. పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య జరిగిన చర్చల అనంతరం..బుద్దాను సాయంత్రం వేళలో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. తనను అదుపులోకి తీసుకున్న సందర్భంగా మాట్లాడిన బుద్దా వెంకన్న.. తాను చేసిన వ్యాఖ్యలకు తానుకట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను అబద్ధాలు చెప్పలేదని.. ఉన్న విషయాలే మాట్లాడినట్లు పేర్కొన్నారు. పోలీసు స్టేషన్ కు తరలించిన బుద్ధా వెంకన్నను పోలీసులు విచారించారు.

చివరకు రాత్రి 11.15 గంటల వేళలో స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు ఆయన్ను విడుదల చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు.. తీవ్రంగా తప్పు పట్టారు. తమ వాళ్లపై దాడి చేసిన వారిని వదిలేసి.. తమ వాళ్లపైనే కేసులు పెట్టటం సిగ్గుమాలిన చర్యగా చంద్రబాబు మండిపడ్డారు. చేసిన పొరపాట్లకు పోలీసులు విచారణను ఎదుర్కొనక తప్పదన్నారు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై నారా లోకేశ్ స్పందిస్తూ.. ఏపీ పోలీసులు ప్రజా రక్షకులా? వైకాపా నేతలకు కాపలాదారులా? అని ప్రశ్నించారు. 
Tags:    

Similar News