రాయలసీమ అ‘జెండా’ పక్కనపెట్టేస్తున్న బైరెడ్డి?

Update: 2017-09-02 18:12 GMT
ప్రత్యేక రాయలసీమ జెండాను భుజానికెత్తుకున్నా జనం ఏమాత్రం గుర్తించకపోవడంతో తత్వం బోధపడిన నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి మళ్లీ పాత గూటికి చేరడానికి రెడీ అయిపోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే టీడీపీలో, చంద్రబాబు ముఖ్య బృందంలో కీలక నేత అయినే బాలకృష్ణతో ఆయన ఇప్పటికే సమావేశమయ్యారట. త్వరలో అనుచరులతో సమావేశమై టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకుంటారని తెలుస్తోంది.
    
నిజానికి బైరెడ్డి నిన్నమొన్నటి వరకు చంద్రబాబుపై తోక తొక్కిన తాచులా లేచేవారు. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు తీవ్ర ద్రోహం చేస్తోందని గొంతెత్తిన ఆయన ఇప్పుడు మళ్లీ అదే చంద్రబాబు వద్ద చేరనున్నట్లు రాయలసీమలో బలంగా వినిపిస్తోంది.  చంద్రబాబు అంతా అమరావతికే పెడుతున్నారంటూ తీవ్రంగా విమర్శించిన ఆయన ఇప్పుడు ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు.
    
నంద్యాల ఉప ఎన్నికల్లో ఆర్పీఎస్ తరపున అభ్యర్థిని నిలిపిన బైరెడ్డి… ఆ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఆయన రాయలసీమ ఉద్యమానికి ముగింపు పలకడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరుల నుంచి వినిపిస్తోంది. ఈ నెల 5న ఆయన అనుచరులతో సమావేశం కాబోతున్నారట.
    
గతంలో  1994 - 1999లో టీడీపీ నుంచి రెండుసార్లు బైరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బైరెడ్డి వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. ఇంతలో టీడీపీని వదిలి రాయలసీమ జెండా పట్టుకున్నారు. అయితే ఇప్పుడు రాయలసీమ ఉద్యమాన్ని వదిలేసి తిరిగి టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. నంద్యాల ఎన్నికల్లో  బైరెడ్డి నిలబెట్టిన అభ్యర్థికి కేవలం 154ఓట్లు మాత్రమే రావడంతో ఆయనకు పరిస్థితి పూర్తిగా అర్థమైందని అంటున్నారు.
Tags:    

Similar News