చిక్కడపల్లి స్టేషన్ లో 'పుష్ప'... ఆ మూడున్నర గంటల్లో ఏమి జరిగింది?
అయితే... విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్పే అవకాశం లేదని చెబుతున్నారు. ఆ అవకాశం ఇవ్వకుండా ఈ రోజు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. పోలీసులు తనకు ఇచ్చిన నోటీసుల మేరకు అల్లు అర్జున్, తన లాయర్ తో కలిసి ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.
అవును... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11:05 గంటల ప్రాంతంలో విచారణకు హాజరుకాగా.. మధ్యాహ్నం 2:47 గంటల వరకూ అంటే.. సుమారు 3:30 గంటల పాటు ఈ విచారణ జరిగింది!
ఈ సమయంలో దాదాపు 20 ప్రశ్నలు అల్లు అర్జున్ పై పోలీసులు సంధించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా విచారణలో అల్లు అర్జున్ తో పాటు అతని తరుపు న్యాయవాది పాల్గొనగా.. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్ లు విచారించారని తెలుస్తోంది.
ప్రధానంగా.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించిన రోజు రాత్రి బెయిల్ పై వచ్చిన అల్లు అర్జున్ మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని.. తనకు చాలా బాదగా ఉందని వ్యాఖ్యనించారు.
ఇదే సమయంలో... తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయారనే విషయం తనకు అప్పుడు తెలియదని.. ఆ విషయం తరువాత రోజు తెలిసి తాను షాక్ అయ్యాయని.. థియేటర్ లో ఉన్నప్పుడు తనవాళ్లు వచ్చి బయట క్రౌడ్ ఎక్కువగా ఉందని చెబితే తాను వెళ్లిపోయానని.. తనను థియేటర్ లో పోలీసులు ఎవరూ కలవలేదని చెప్పుకొచ్చారు!
అయితే... తొక్కిసలాటలో మహిళ చనిపోయారని, బాలుడు తీవ్రంగా గాయపడ్డారని.. పరిస్థితి అదుపు తప్పిందని.. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ ని కలిసి చెప్పామని.. అయినప్పటికీ... సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పారని.. ఏసీపీ రమేష్ వెల్లడించారు. సరిగ్గా ఇదే విషయం కేంద్రంగా ఈ రోజు విచారణ జరిగిందని అంటున్నారు.
ప్రధానంగా.. తొక్కిసలాటలో రేవతి చనిపోయిందనే విషయం మీకు తెలుసు కదా..?
తర్వాత రోజు వరకూ తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారు..?
థియేటర్ లో బెనిఫిట్ షోకి రావడానికి అనుమతి ఉందని మీకు ఎవరు చెప్పారు..?
మీరు సుమారు 2:30 గంటల పాటు థియేటర్ లో ఉన్నది నిజం కాదా..?
రోడ్ షో ఎందుకు చేశారు..? వంటి మొదలైన ప్రశ్నలు అడిగారని అంటున్నారు. అయితే.. వీటిలో పలు ప్రశ్నలకు అల్లు అర్జున్ సైలంట్ గా ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో... ఈ విచారణలో భాగంగా... అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు అదే కీలకం కాబోతుందని అంటున్నారు.
పోలీసులు సంతృప్తి చెందకపోతే...?:
గత కొన్ని రోజులుగా సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వ పెద్దల కామెంట్లు, మంత్రుల విమర్శలకు తోడు పోలీసులు దూకుడు పెంచారని అంటున్నారు. ప్రధానంగా ఇటీవల మీడియా సమావేశం పెట్టిన అల్లు అర్జున్ చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు ఆ ఘటన జరిగిన సమయంలో పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టినట్లుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని, తమ కస్టడీలోకి తీసుకోవాలని గనుక పోలీసులు భావిస్తే... ప్రధానంగా నిందితుడు విచారణకు సహకరించలేదని.. ఇటీవల ప్రెస్ మీట్ లో.. బాధితుడికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు అల్లు అరవింద్ స్టేట్ మెంట్ ను పోలీసులు పరిగణలోకి తీసుకుని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే... విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్పే అవకాశం లేదని చెబుతున్నారు. ఆ అవకాశం ఇవ్వకుండా ఈ రోజు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సుమారు 3:30 గంటలు విచారణలో పాల్గొన్నారు. అయితే... సమాధానాలు సరిగ్గా చెప్పలేదని కోర్టుకు చెప్పే అవకాశం మాత్రం పోలీసులకు ఎప్పుడూ ఉంటుందని అంటున్నారు.
సమాధానాలు సరిగ్గా చెప్పలేదు అంటే ఏమిటి..? అనే విషయంలో పోలీసులు చెప్పే విషయాలపై న్యాయస్థానం కన్విన్స్ అవ్వాల్సి ఉంటుందని.. అలా కానిపక్షంలో బెయిల్ రద్దుకు కోర్టు అంగీకరించదని చెబుతున్నారు. మరి... విచారణలో అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలతో పోలీసులు కన్వినెస్ అయ్యారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇదే సమయంలో... విచారణ నేటితో ముగిసిందా, లేక పార్ట్ - 2 ఉంటుందా అనేది తెలియాల్సి ఉంటుందని అంటున్నారు.