15 రోజుల్లో డబ్బులివ్వకపోతే ఆర్జీవీని అరెస్టు చేసి లోపలేస్తాం..

ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వ్యూహం సినిమాకు వర్మ డబ్బు తీసుకోవడం, ఈ ఉదంతంలో ఎక్కడా నిబంధనలు పాటించకపోవడంతో డబ్బు రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2024-12-24 13:16 GMT

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహం సినిమా వ్యూస్ లేకపోయినా, తప్పుడు లెక్కలు చూపించి ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీ తీసుకున్న రూ.1.15 కోట్లు 15 రోజుల్లోగా చెల్లించాలని అల్టిమేటం ఇచ్చారు. ఇప్పటికే నోటీసులిచ్చామని గడువులోగా డబ్బు చెల్లించని పక్షంలో కేసులు నమోదు చేసి అరెస్టు చేయిస్తామని హెచ్చరించారు జీవీ రెడ్డి.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి సన్నిహితుడైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఆయన సినిమా ప్రమోషన్ల కోసం అప్పటి ప్రతిపక్ష నేతలు, ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల నుంచి కోర్టు ద్వారా రక్షణ పొందిన వర్మ ప్రభుత్వం తనను ఏమీ చేయలేదని సంకేతాలిచ్చారు. దీంతో ఆయన వ్యవహారాలపై కూపీలాగిన ప్రభుత్వానికి పక్కా ఆధారాలతో సహా దొరికిపోయారు వర్మ. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వ్యూహం సినిమాకు వర్మ డబ్బు తీసుకోవడం, ఈ ఉదంతంలో ఎక్కడా నిబంధనలు పాటించకపోవడంతో డబ్బు రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం జగన్‌, వైసీపీకి మేలు జరిగేలా రామ్ గోపాల్ వర్మ‘వ్యూహం’ సినిమా తీశారు. దీన్ని ఏపీ ఫైబర్ నెట్లో ప్రసారం చేసినందుకు గాను కోటి14 లక్షల 96 వేల 610 రూపాయలు చెల్లించడాన్ని ఏపీ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ తీవ్రంగా పరిగణించింది. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టం జరిగిందంటూ ఎండీ దినేశ్‌కుమార్‌ దర్శకుడు వర్మ, చిత్ర నిర్వాహకులకు గత శనివారం లీగల్‌ నోటీసులిచ్చారు. 12 శాతం వడ్డీ, 18 శాతం ఫైన్ తో కలిపి నోటీసు అందుకున్న 15రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు. ఇదే విషయమై ఆర్జీవీతోపాటు గతంలో ఫైబర్ నెట్ కార్యాలయంలో పనిచేసిన అధికారులకు నోటీసులిచ్చారు.

‘వ్యూహం’ సినిమా ఫస్ట్ పార్ట్ కు 1,845 వ్యూస్‌, సెకండ్ పార్ట్ కు 383 వ్యూస్‌ మాత్రమే వచ్చాయి... కానీ, చిత్ర నిర్మాతలు, దర్శకుడు తప్పుడు పత్రాలు స్రుష్టించి 2,09,000 వ్యూస్‌ వచ్చాయంటూ రూ.2,09 కోట్లు తీసుకున్నారు. దీంతో ఈ డబ్బు రికవరీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆర్జీవీకి నోటీసులిచ్చింది. దీనిపై ఇంతవరకు స్పందించని ఆర్జీవీ డబ్బు తిరిగి చెల్లిస్తాడా? లేదా? అనేది చూడాల్సివుంది.

Tags:    

Similar News