హైద‌రాబాద్ మెట్రో.. ఐడియా అదిరిపోలా

Update: 2020-02-23 14:35 GMT
ఈ రోజుల్లో జ‌నాల‌కు మామూలు ప‌ద్ధ‌తుల్లో మంచి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తే ప‌ట్ట‌దు. ఒక్క క్ష‌ణం విని వ‌దిలేస్తారు. కానీ వాళ్ల‌కు సూటిగా హృద‌యాన్ని తాకేలా ఏ విష‌యాన్న‌యినా చెబితే ఆచ‌రిస్తారు. శారీర‌క శ్ర‌మ బాగా త‌గ్గిపోయి.. స‌రైన జీవ‌న శైలి లేక ఎన్నో జ‌బ్బులు తెచ్చుకుంటున్నారు ఇప్ప‌టి జ‌నాలు. ఇంటి నుంచి బ‌య‌ట అడుగు పెడితే వాహ‌నం ఉండాలి. మ‌ళ్లీ ఇల్లు చేర‌డానికీ వెహిక‌ల్ కావాలి. ఎక్క‌డా శ్ర‌మ లేకుండా.. ఒంటికి నొప్పి తెలియ‌కుండా ప‌ని అయిపోవాలి. ఇలాంటి వాళ్ల‌లో చైత‌న్యం వ‌చ్చేలా హైద‌రాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ వినూత్న‌మైన ఆలోచ‌న చేసింది. మెట్రో రైల్ ఎక్కేందుకు వ‌చ్చే ప్ర‌యాణికులు లిఫ్ట్ - ఎక్స‌లేట‌ర్ల‌ను ఉప‌యోగించ‌కుండా మెట్లు ఎక్కి పైకి వెళ్లేలా వారిలో ఆలోచ‌న రేకెత్తించే ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేసింది.

మెట్లు ఎక్కి పైకి చేరుకుంటే ఒంటికి మంచిద‌ని తెలియ‌జేస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కితే ఎన్ని కేల‌రీలు ఖ‌ర్చ‌వుతాయో.. ఆయా మెట్లు మీద రంగుల‌తో నంబ‌ర్ వేశారు. ఇది చూసిన ఎవ‌రైనా కేల‌రీలు త‌గ్గించుకుందామ‌ని మెట్లు ఎక్కే ఆలోచ‌న చేస్తార‌న‌డంలో సందేహం లేదు. నిజానికి లిఫ్టులు, ఎస్క‌లేట‌ర్లు వ‌య‌సు మ‌ళ్లిన వ్య‌క్తులు, దివ్యాంగుల కోసం ఉద్దేశించిన‌వి. కానీ వాటిని అంద‌రూ వాడేస్తున్నారు. లిఫ్ట్ అందుబాటులో లేకున్నా వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూస్తున్నారు. వాటి ద‌గ్గ‌ర క్రౌడ్ ఎక్కువైపోతుండ‌టంతో మెట్రో వాళ్లు ఈ ఆలోచ‌న చేశారు. ఎన్ని మెట్లు ఎక్కితే ఎన్ని కేలరీలు కరుగుతాయో తెలుసుకుంటూ ప్ర‌యాణికులు వాటి ద్వారానే పైకి ఎక్కుతున్నారు. ప్ర‌స్తుతం కొన్ని స్టేష‌న్ల‌లోనే ఇలా మెట్ల‌కు రంగులేశారు. మున్ముందు అన్ని స్టేష‌న్ల‌లో ఈ ప్లాన్ అమ‌లు చేసి ప్ర‌యాణికుల్లో చైత‌న్యం పెంచాల‌ని చూస్తున్నారు.


Tags:    

Similar News