అనిల్ కుమార్ యాద‌వ్ నియోజ‌క‌వ‌ర్గం మారి గెల‌వ‌గెల‌రా?

Update: 2022-07-12 12:30 GMT
నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీలో బ‌ల‌మైన రెడ్ల ఆధిప‌త్యాన్ని త‌ట్టుకుంటూ త‌న‌కుంటూ సొంత ఇమేజ్ తో ఎదిగిన యాద‌వ నేత‌.. అనిల్ కుమార్ యాద‌వ్. 2009లో నెల్లూరు సిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ప్ర‌జారాజ్యం పార్టీ అభ్య‌ర్థి శ్రీధ‌ర కృష్ణారెడ్డి చేతిలో చిత్త‌య్యారు. ఆ త‌ర్వాత 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచినా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాలేదు. ఇక 2019లోనూ అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొంది వైఎస్ జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో కీల‌క‌మైన జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాద‌వ్ చ‌క్రం తిప్పారు.

ఈ క్ర‌మంలో పోలవ‌రం ప్రాజెక్టు అప్పుడు పూర్త‌వుతుంది.. ఇప్పుడు పూర్త‌వుతుంది అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పి అభాసుపాల‌య్యారు. మ‌రోవైపు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిలాగా ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు ప‌రిమిత‌మ‌య్యార‌నే ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై ఉన్నాయి. మ‌రోవైపు శాఖ‌పై కూడా ప‌ట్టు సాధించ‌లేక‌పోవ‌డంతో త‌న మంత్రిప‌ద‌విని రెండో విడ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో పోగొట్టుకున్నారు. మ‌రోవైపు నెల్లూరు సిటీలో బ‌ల‌మైన రెడ్డి నేత‌లు కూడా అనిల్ కుమార్ యాద‌వ్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఈసారి అనిల్ కుమార్ యాద‌వ్ నియోజ‌క‌వ‌ర్గం మారుస్తున్నార‌ని వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వెంక‌ట‌గిరిలో బీసీలు ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారు. నేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారితోపాటు ఇత‌ర కులాల్లోనూ బీసీలు ఎక్కువ‌. అందుక‌ని ఈసారి అనిల్ వెంక‌ట‌గిరి పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఈ దిశ‌గా ఇప్ప‌టికే అనిల్ కూడా త‌న అనుచ‌రుల‌కు సంకేతాలు ఇచ్చార‌ని చెప్పుకుంటున్నారు.

మ‌రోవైపు వెంక‌ట‌గిరి ప్ర‌స్తుత ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీకి చెందిన ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న కుమార్తె కైవ‌ల్యా రెడ్డి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.

ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కైవ‌ల్యారెడ్డి లేదా ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో ఆత్మ‌కూరు నుంచి ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంద‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈసారి టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే అనిల్ కుమార్ యాద‌వ్ ను వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేయించ‌డానికి వైఎస్సార్సీపీ అధిష్టానం సిద్ధ‌మవుతోంద‌ని చెబుతున్నారు. ఇలా చేస్తే వెంక‌ట‌గిరిలో ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి పార్టీ మారితే ఏర్ప‌డే లోటును భ‌ర్తీ చేయొచ్చ‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ని అంటున్నారు. అలాగే నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాద‌వ్ పై అసంతృప్తిగా ఉన్న రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేత‌లను సంతృప్తిప‌ర‌చ‌వ‌చ్చ‌ని వైఎస్సార్సీపీ అధిష్టానం భావిస్తోంద‌ని స‌మాచారం.
Tags:    

Similar News