ఏపీ అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల బిల్లు పెట్ట‌గ‌ల‌రా?

Update: 2022-09-15 05:59 GMT
అనుకున్న‌ట్టుగానే ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు తొలి రోజు సెప్టెంబ‌ర్ 15న‌ మొద‌ల‌య్యాయి. మొద‌ట ఇటీవ‌ల మ‌ర‌ణించిన మాజీ ఎమ్మెల్యేల‌కు స‌భ్యులు సంతాపం తెలిపారు. ఆ త‌ర్వాత వెంట‌నే ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. వైఎస్సార్సీపీ, టీడీపీ స‌భ్యుల మ‌ధ్య ర‌చ్చ మొద‌లైంది. వివిధ అంశాల‌పై మాట్లాడిన మంత్రులు అంబ‌టి రాంబాబు, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్.. చంద్ర‌బాబుపై, టీడీపీ ఎమ్మెల్యేల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వాయిదా తీర్మానాలపై టీడీపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం హామీ ఇచ్చినా.. వాళ్లు విన‌లేదు. ఈ క్రమంలో.. మంత్రి బుగ్గన టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు.

కాగా ఓవైపు అమ‌రావ‌తే ఏకైక రాజ‌ధానిగా ఉండాల‌ని కోరుతూ అమ‌రావ‌తి రైతులు మ‌హాపాద‌యాత్ర‌-2 కు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని వెంక‌ట‌పాలెం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు ఈ పాద‌యాత్ర సాగుతుంది. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు అని ఈ పాద‌యాత్ర‌కు రైతులు పేరు పెట్టారు. కాగా రైతుల పాద‌యాత్ర‌పై ఇప్ప‌టికే వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓ రేంజులో ధ్వ‌జ‌మెత్తిన సంగ‌తి తెలిసిందే. తాము మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల‌ను స‌మగ్రంగా అభివృద్ధి చేయ‌డానికే మూడు రాజ‌ధానులు తెస్తున్నామ‌ని నొక్కి వ‌క్కాణిస్తున్నారు.

తాజా అసెంబ్లీ సమావేశాల్లో మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు బిల్లు తెస్తామ‌ని చెప్పారు. అయితే ఈ బిల్లును గ‌తంలో హైకోర్టు కొట్టేసింది. ఏపీ ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే కేంద్రం నోటిఫై చేసిన రాజ‌ధానిని మార్చే హ‌క్కు లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వివిధ కేసుల్లో వెళ్తున్న‌ట్టే సుప్రీంకోర్టుకు వెళ్తుంద‌ని భావించారు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ ప‌నిచేయలేదు. వ్యూహాత్మ‌కంగా గుంభ‌నంగా ఉండిపోయింది. ఆ బిల్లులో న్యాయ‌ప‌ర‌మైన లొసుగులు త‌లెత్త‌కుండా మ‌రోమారు ప‌టిష్టంగా బిల్లును రూపొందించి.. దాన్ని శాస‌న‌స‌భ‌లో ఆమోదించుకోవ‌డానికి కృత‌నిశ్చ‌యంతో ఉంది. అలాగే శాస‌న‌మండ‌లిలోనూ ఆమోదింప‌జేసుకుని మూడు రాజ‌ధానుల ఏర్పాటు విష‌యంలో ముందుకెళ్లాల‌ని త‌ల‌పోస్తోంది.

అయితే తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో బిల్లు తెచ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. హ‌డావుడిగా మ‌ళ్లీ బిల్లు తెస్తే న్యాయ‌స్థానంలో ఇబ్బందులో త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెనుకాడుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానుల‌పై అసెంబ్లీలో చ‌ర్చ పెట్టి.. మూడు రాజ‌ధానుల ప్ర‌యోజ‌నాల‌ను, ఇప్ప‌టికే ఒక‌టి కంటే ఎక్కువ రాజ‌ధానులు ఉన్న దేశాలు, రాష్ట్రాల్లో స్థితిగ‌తుల‌ను, అక్క‌డ జ‌రిగిన అభివృద్ధిని పవ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా శాస‌న‌స‌భ‌లో స‌భ్యులంద‌రికీ వివ‌రిస్తుంద‌ని అంటున్నారు. దాన్ని ప్ర‌త్యక్ష ప్ర‌సారం చేసేలా ప్ర‌జ‌లంద‌రూ చూసేలా చేసి దీన్ని రాష్ట్రంలో అంద‌రిలో చ‌ర్చను లేవ‌నెత్త‌డ‌మే ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని అంటున్నారు.

శాస‌న‌స‌భ‌లోనూ, శాన‌స‌మండ‌లిలోనూ ప్ర‌స్తుతం వైఎస్ఆర్సీపీకే బ‌లం ఉంది. ఈ నేప‌థ్యంలో మూడు రాజ‌ధానుల బిల్లు నెగ్గ‌డం చాలా సులువు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు అంబ‌టి రాంబాబు, సీదిరి అప్ప‌ల‌రాజు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వంటివారు మూడు రాజ‌ధానుల అంశంపై శాస‌న‌స‌భ‌, మండ‌లిలో మాట్లాడ‌తార‌ని చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ 15 గురువారం మొద‌టి రోజు అసెంబ్లీ స‌మావేశాలే ఇందుకు వేదిక అవుతాయ‌ని అంటున్నారు.

ఇక సీఎం వైఎస్ జ‌గ‌న్ సుదీర్ఘంగా మూడు రాజ‌ధానుల అంశం, పాల‌నా వికేంద్రీక‌ర‌ణ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇస్తార‌ని పేర్కొంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News