సీన్ రివర్స్.. కోట్లల్లో జీతం.. పనేమీ లేదని యజమానిపై కేసు..!

Update: 2022-12-06 03:30 GMT
ప్రభుత్వ ఉద్యోగం మినహా మిగిలిన అన్ని చోట్ల జీతం మూరెడు.. పని బారెడు అన్నట్లుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలైతే పని చేసినా.. చేయకపోయినా నెల వచ్చే వరకు ఠంచన్ గా లక్షల్లో జీతం పడుతుంది. అదే ప్రైవేట్ ఉద్యోగాలైతే ఆ వ్యక్తి బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. టైంకు జీతాలు రావు. పని గంటలు ఎక్కువ.. ఒక్క నిమిషం ఆలస్యమైన జీతంలో కోత.. సెలవులు దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

దీనికితోడు ఎంత పని చేసినా తగిన గుర్తింపు రాదు. జీతం పెరిగిందని సంతోషించే లోపు పని భారం తడిసి మోపెడు అవడం ఖాయం. ఓ స్థాయిలో ఉన్న ప్రైవేటు ఉద్యోగికే ఇన్ని బాధలుంటే ఇక చిన్న.. చితక ఉద్యోగాలు చేసే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇక బాస్ లతో చీవాట్ల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అరకొర జీతాలతో పూట గడవక చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సంగతి మన అందరికీ తెలిసిందే.

అయితే ఓ ఉద్యోగికి యజమాని ఏ పని చెప్పకుండా నెలనెల లక్షల్లో జీతం ఇస్తున్నాడు. దీనికి ఆ ఉద్యోగి సంతోషించాల్సి పోయి ఏకంగా ఆ యజమానిపైనే కేసు పెట్టిన ఘటన ఐర్లాండ్ లో చోటు చేసుకుంది. ఇలాంటి విచిత్రమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు సైతం నాకు అలాంటి ఉద్యోగం ఉంటేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇంతకీ ఆ జాబ్ ఏంటి.. ఆ ఉద్యోగికి వచ్చిన సమస్య ఏంటి అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐర్లాండ్ కు చెందిన డెర్మోట్ అలెస్టర్ రైల్వేలో ఫైనాన్షియల్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. కంపెనీ క్యాపిటల్ బడ్జెట్ బాధ్యతను డెర్మోట్ చూసుకునేవాడు. 2010లో అతడికి కంపెనీ బలవంతంగా ప్రమోషన్ ఇచ్చి మరో కీలక పదవీలో కూర్చోబెట్టింది. ఆ తర్వాత అతడికి మూడు నెలల స్టడీ లీవ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత జాబ్ లో చేరిన డెర్మెట్ కు బకాయిదారుల సొమ్ము విషయం నిమిత్తం కంపెనీలో గొడవ జరుగుతూ వస్తోంది.

ఈ విషయంపై డెర్మోట్ కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాడట. నాటి నుంచి అతడిని ఆఫీసులోని అన్ని పనుల నుంచి తొలగించారు. కానీ ఉద్యోగం నుండి మాత్రం తొలగించలేదు. దీంతో అతడు రోజూ ఆఫీసుకి వచ్చి కేవలం వార్తాపత్రికలు చదువుతూ తెచ్చుకున్న భోజంన తిని వెళ్లిపోయాడు. అయినప్పటికీ అతడికి ఠంచన్ గా నెలనెలా జీతం కూడా కంపెనీ నుంచి వచ్చేది. అయితే కంపెనీ విషయాలేవీ తనకు చెప్పకపోవడంతో ఉద్యోగం అతడికి బోరింగ్ గా అనిపించింది.

ఈక్రమంలోనే డెర్మోట్ కంపెనీ యజమానిపై ఐర్లాండ్ లేబర్ కోర్టులో కేసు పెట్టాడు. వారంలో ఒక్క రోజు కూడా తనకు పని చేసేందుకు కంపెనీ అవకాశం కల్పించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలో తనకు ఎనిమిది కోట్ల జీతం వచ్చేదని.. ఇప్పుడు కేవలం మూడు కోట్లు మాత్రమే వస్తుందని ఆరోపించాడు.

తన నైపుణ్యాన్ని పనికిరానిదిగా చేయడం వల్ల తానెంతో నిరాశకు గురయ్యానని డెర్మోట్ వివరించాడు. కాగా ఈ కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో అతడు చేసింది కరెక్టా? కాదా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద మాతో పంచుకోండి. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News