కేసు నమోదు చేసేంత పెద్ద తప్పు ఈటల ఏం చేశారు?

Update: 2021-10-12 04:05 GMT
ఆయనేం చిన్న పిల్లాడు కాదు. ఏళ్లకు ఏళ్లు రాజకీయాల్లో నలిగిన వాడు. అధికారాన్ని అరచేతిలో పెట్టుకొని తిరిగినోడు. దర్పమన్నది లోటు లేకుండా పుష్కలంగా ఉన్నప్పటికీ తొందరపడకుండా వ్యవహరించే నైజం మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంతం. అలాంటి ఈటల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వేళలోనూ ఆయనపై నమోదు చేయని కేసు.. తాజాగా మాత్రం ఉప ఎన్నిక వేళ.. ఆయన చేస్తున్న ప్రచారంలోని లోపాల్ని ఎత్తి చూపిస్తూ కేసు నమోదు చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారి.. అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ పై తాజాగా కేసు నమోదైంది. ఇంతకూ ఆయనే చేసిన మహా అపరాధం.. ఘోరమైన నేరం ఏమిటో తెలుసా? కొవిడ్ నిబందనల్ని ఉల్లంఘించిన సభ పెట్టారట. ఆ విషయాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. హుజూరాబాద్ లో బుక్ అయిన ఈ కేసు గురించి విన్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అదేందో.. ఫ్లయింగ్ స్వ్రాడ్ కొందరు ఏర్పాటు చేసే సభల్లోనే కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించటం కనిపించటం ఏమిటో?

అయితే.. ఈ కేసును లైట్ తీసుకున్న ఈటల.. తన పని తాను చేసుకుంటున్నారు. బాధితుల పక్షాన నిలుస్తూ.. వారి కోసం రోడ్ల మీద దీక్ష చేసేందుకు సైతం వెనకాడటం లేదు. తాజాగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఆటో.. కారు ఢీ కొని ఒకరు మరణించారు. దీంతో మరణించిన వ్యక్తిబంధువులు రోడ్డు మీద ధర్నాకు దిగారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ ఆందోళనకు ఫలితంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. బాధితుల్ని పరామర్శించిన మంత్రి ఈటల.. వారితో పాటు నిరసనలో కూర్చొని సంఘీభావం తెలిపారు. తన మీద నమోదవుతున్న కేసుల్ని పెద్దగా పట్టించుకోకుండా.. ప్రచారంపైనా.. ప్రజలకు దగ్గరయ్యే అంశం మీదనే ఈటల ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకేం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News