యాదాద్రికి తీసుకెళ్లి మరీ ఓటర్ల చేత ప్రమాణాలా? టీఆర్ఎస్ పై కేసు నమోదు

Update: 2022-10-22 04:15 GMT
గెలుపు తప్పనిసరిగా మారిన ఉప ఎన్నికల్లో విజయం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు గులాబీ నేతలు. అందుకోసం ఇప్పటివరకు నడిచిన దారిని విడిచిపెట్టి.. కొత్త పద్దతుల్లో ఓట్ల వేటకు సిద్ధమవుతున్నట్లుగా విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏం చేసినా సరే..

అంతిమంగా విజయం మాత్రం కావాలన్నట్లుగా గులాబీ నేతల తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే నోట్ల కట్టలు ప్రవాహంలా మారటం ఒక ఎత్తు అయితే.. తమకు మాత్రమే ఓటు వేయాలన్న మాట ఇచ్చే విషయంలో సరికొత్త సెంటిమెంట్ కు కట్టుబడి ఉండేలా చేస్తున్న ప్రయత్నాలు విస్మయానికి గురి చేస్తున్నాయి.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు రావటంపై.. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ కావటం చోటు చేసుకుంది. తాజాగా మునుగోడు ఓటర్లను యాదాద్రికి ప్రత్యేకంగా తరలించి.. గుడిలో ఓటర్ల చేత టీఆర్ఎస్ కు మాత్రమే ఓటు వేస్తామని చెబుతూ ప్రమాణాలు చేయించిన టీఆర్ఎస్ పార్టీపై ఎన్నికల కోడ్ ప్రత్యేక టీం కంప్లైంట్ చేసింది. ఇందుకు అనుగుణంగా చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి కేసు నమోదు చేసిన వైనం బయటకు వచ్చింది.

చౌటుప్పల్ మండలం దండు మల్కాపురానికి చెందిన సుమారు 700 మందిని యాదాద్రికి ప్రత్యేకంగా తీసుకెళ్లారు టీఆర్ఎస్ నేతలు. ఇందుకోసం 15 ఆర్టీసీ బస్సుల్లో గ్రామ టీఆర్ఎస్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న గులాబీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎపిసోడ్ నడిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సాక్ష్యంగా బయటకు రావటం సంచలనంగా మారింది.

ఇలా ఓట్ల కోసం గుడికి తీసుకెళ్లి ప్రమాణాలు చేయించిన వైనంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన ఈసీ.. టీఆర్ఎస్ పార్టీ మీద కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఈ 700 మంది ఓటర్లను యాదాద్రికి బస్సుల్లో తరలించి..

దర్శనం చేయించిన ఉదంతానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ఎన్నికల ఖర్చు ఖాతాకు జత చేయాలని ఆదేశించారు. మొత్తానికి ఆశన్నగారి జీవన్ రెడ్డి ఉత్సాహం గులాబీ పార్టీకి ఒక కేసును ఇవ్వటమే కాదు.. అభ్యర్థి కూసుకుంట్లకు భారీ ఖర్చు ఒకటి ఆయన ఖాతాలో జమ అయ్యేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News