​23న మొదలైనా ​ముఖ్యులంతా వచ్చేది 27నే

Update: 2015-12-18 05:24 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత హోదాలో అత్యంత వైభవంగా చేపట్టిన అయుత చండీయగానికి సంబంధించింది ప్రముఖులు పలువురు వస్తున్నారు. ప్రముఖులకు సంబంధించి రాకపోకలపై ఇప్పటివరకూ స్పష్టత రానప్పటికీ.. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. ముఖ్యలంతా యాగం చివరి రోజునే రానున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ 23న మొదలయ్యే చండీయాగం ఈ నెల 27వరకూ సాగనుంది.

ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. గవర్నర్లు నరసింహన్ (తెలుగు రాష్ట్రాలు).. రోశయ్య (తమిళనాడు).. విద్యాసాగర్ రావు (మహారాష్ట్ర).. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. హైకోర్టు ప్రధానన్యాయమూర్తితో పాటు.. పలువురు జడ్జిలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వస్తున్నారు. యాగానికి వచ్చే ప్రముఖుల కోసం.. ఐదు హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. పార్కింగ్ కోసం 15 వేల వాహనాలకు సరిపడా ఏర్పాట్లు చేస్తున్నారంటే.. యాగం ఏ రేంజ్ లో జరగనుందన్నది ఈ ఏర్పాట్లు చూస్తేనే తెలియనుంది.

యాగానికి వచ్చే ప్రముఖులు నిత్యం వస్తే.. వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పాటు.. చివరి రోజు వస్తే యాగం ఫలం దక్కుతుందన్న నమ్మకం కూడా.. చివరి రోజున రావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా చెప్పటం కనిపిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన సందర్భంలో ఇన్విటేషన్ ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు చివరి రోజున వస్తున్నారని.. బాబు కూడా సతీసమేతంగా చివరిరోజు రావాలంటూ కోరటం గమనార్హం. యాగానికి సంబంధించిన హడావుడి 23నే మొదలైనా.. ప్రముఖులు పోటెత్తేది మాత్రం 27నే అని చెప్పక తప్పదు.

Tags:    

Similar News