టీడీపీలో తేలిన కర్నూలు పంచాయితీలు..?

Update: 2019-03-18 17:24 GMT
కర్నూలు జిల్లా అభ్యర్థిత్వాల విషయంలో తెలుగుదేశం పార్టీలో పంచాయితీలు తేలినట్టేనా? ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు నామినేషన్ల దాఖలాలు పూర్తి అయ్యాయి. అయితే కర్నూలు జిల్లాలో కొన్ని సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాలు తేలిన దాఖలాలు కనిపించడం లేదు.

అందులో ముఖ్యమైనవి..కర్నూలు సిటీ అసెంబ్లీ - నంద్యాల అసెంబ్లీ - నంద్యాల ఎంపీ సీట్లున్నాయి. వీటిల్లో అభ్యర్థిత్వాల విషయంలో తీవ్రమైన లొల్లి ఉంది. కర్నూలు అసెంబ్లీ టికెట్ విషయంలో టీజీ కుటుంబం వర్సెస్ ఎస్వీ మోహన్ రెడ్డి పోరు సాగింది. టీజీ భరత్ - ఎస్వీ మోహన్ రెడ్డిలు టికెట్ విషయంలో పోటీ పడ్డారు. ఎవరికి వారు తమదే టికెట్ అని ప్రకటించుకున్నారు.అయితే బాబు ఎంతకూ తేల్చలేదు.

అయితే ఇప్పుడు ఆ  కథ తేలిపోయిందని టీజీ భరత్ కు చంద్రబాబు నాయుడు టీడీపీ టికెట్ ను ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. భరత్ కు టికెట్ ఖరారు చేసి.. మోహన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట. మరి మోహన్ రెడ్డి రాజీ పడతారా? అనేది ఇంకా కొశ్చన్ మార్క్.

ఇక నంద్యాల ఎమ్మెల్యే టికెట్ విషయంలో భూమా బ్రహ్మానందరెడ్డికి బాబు భరోసా ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. బ్రహ్మానందరెడ్డికి టికెట్ దక్కుతుందా, లేదా అనేది చర్చగా నిలుస్తూ వచ్చింది. చివరకు ఆయనకే టికెట్ ఖరారు అయ్యిందని సమాచారం.

బ్రహ్మానందరెడ్డి తప్ప మరెవరు టీడీపీ తరఫున పోటీ చేసినా కనీసం పోటీ ఇవ్వలేరనే ప్రచారం నేపథ్యంలో.. ఆయనకే టికెట్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పెండింగ్ లో  ఉన్న ఎమ్మెల్యే సీట్ల విషయంలో బాబు తేల్చేశారట.
Tags:    

Similar News