బీచ్‌ లో కొన‌సాగుతున్న 'ప్ర‌త్యేక‌' ఆందోళ‌న‌లు

Update: 2017-01-30 09:09 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ ఆర్కే బీచ్ వేదిక‌గా జ‌న‌వ‌రి 26న త‌ల‌పెట్టిన శాంతియుత నిర‌స‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అడ్డుకున్న‌ప్ప‌టికీ... ఆర్కే  బీచ్ వేదిక‌గా ప‌లువురు తమ ఆకాంక్ష‌ను వెల్ల‌డిస్తున్నారు. ప్రత్యేక హోదా కోరుతూ ఆర్‌ కె బీచ్‌ లో ఆంధ్రా యువత పేరుతో యువకులు మౌన దీక్ష చేపట్టారు. తమిళనాడుకు జల్లికట్టు కల్చర్‌- ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఫ్యూచర్‌ అంటూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని ప్రత్యేక హోదాతోనే మేలు కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా రాష్ట్ర భ‌విష్య‌త్ గురించి ఆలోచించాల‌ని హిత‌వు ప‌లికారు. జ‌ల్లిక‌ట్టు విష‌యంలో త‌మిళ‌నాడులో ఆ రాష్ట్ర యువ‌తే గ‌ళం విప్పి నిషేధాన్ని ఎత్తివేయించుకున్నార‌ని అదే రీతిలో ఏపీకి ప్ర‌త్యేక హోదాను సైతం యువ‌త సాధిస్తుంద‌ని అన్నారు.

ఇదిలాఉండ‌గా ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో  ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 'ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమా?' అనే అంశంపై గుంటూరులో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసిన బీజేపీ - టీడీపీ నేతలు ఇప్పుడు ముగిసిన అధ్యాయం అని పేర్కొనడం ప్రజలను మోసం చేయడమేనని వక్తలు పేర్కొన్నారు. సమావేశంలో హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ - రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా తక్షణం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్ర‌త్యేక హోదాతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు క‌లిగే అభివృద్ధికి - ప్ర‌త్యేక ప్యాకేజీతో క‌లిగే అభివృద్ధికి పొంత‌నే లేద‌ని విశ్లేషించారు. రాష్ట్రంలో వివిధ సంస్థ‌లు - అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డం ప్యాకేజీ వ‌ల్ల కాద‌ని విభ‌జ‌న చ‌ట్టంలోనే ఈ మేర‌కు ఆనాటి కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చింద‌ని వివ‌రించారు. ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌భుత్వం హోదా అనేది వ‌దిలేసిన అంశంగా భావించ‌కుండా సంఘ‌టిత పోరాటాలు చేసి కేంద్రం ద్వారా స్పెష‌ల్ స్టేట‌స్ సాధించుకోవాల‌ని శ్రీ‌నివాస్ సూచించారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్‌ అధ్యక్షులు వివిఆర్‌.కృష్ణంరాజు మాట్లాడుతూ, విభజనతో అపారంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా మాత్రమే కాపాడుతుందని చెప్పారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ - ప్రత్యేక హోదాపై ఉద్యమించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ టీడీపీ-బీజేపీలు మాట మార్చాయనే విషయాన్ని ప్రజలంతా గ్రహించారని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన స్థానిక‌ బీజేపీ - టీడీపీ నాయ‌కులు మాట్లాడుతూ సాంకేతిక అవాంత‌రాలు ఉన్నందునే హోదా కేటాయింపు జ‌ర‌గ‌డం లేద‌ని వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News