*అన్న‌దాతా*!... బాబును ముంచేయ‌డం ఖాయం!

Update: 2019-02-17 04:09 GMT
ఎన్నిక‌ల మేనేజ్ మెంట్ లో టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిది అందె వేసిన చెయ్య‌ని అంద‌రూ చెబుతున్న‌దే. అయితే మరో రెండు నెల‌ల్లో ఏపీ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఎన్నికల్లో మాత్రం ఆయ‌న మంత్రాంగం ఫ‌లించే అవ‌కాశాలు దాదాపుగా లేవ‌నే చెప్పాలి. ఎన్నిక‌లొచ్చే దాకా చాలా తీరిగ్గా క‌నిపించే చంద్ర‌బాబు... ఎన్నిక‌ల టైం వ‌చ్చిందంటే చాలు త‌న బుర్ర‌కు ప‌దును పెట్టేస్తారు. ఇది నిజ‌మేనన్న‌ట్లుగా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల అమలును మొన్న‌టిదాకా అట‌కెక్కించేసిన చంద్ర‌బాబు... మ‌ళ్లీ ఎన్నిక‌లు త‌రుముకు వ‌స్తున్న వేళ‌... వాటి అమ‌లును ప్రారంభించేశారు. అయితే ఈ హామీలు చంద్ర‌బాబుకు ఏ మేర‌కు దోహదం చేస్తాయ‌న్న విష‌యం కాసేపు ప‌క్క‌న‌పెడితే... ఈ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా చంద్రబాబు కొత్త‌గా తీసుకొస్తున్న ప‌థ‌కాలు మాత్రం ఆయ‌న‌కు ఓట‌మినే గిఫ్ట్‌ గా ఇవ్వ‌నున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడు బాబు కొత్త‌గా ప్ర‌క‌టిస్తున్న ప‌థ‌కాల్లో మెజారిటీ ప‌థ‌కాలు గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు కాగా.. మరికొన్ని విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన ప‌థ‌కాల్లో కాపీ కొట్టిన‌వి.

ఇలా జ‌గ‌న్‌ ను కాపీ కొట్టేసి బాబు ప్ర‌క‌టించిన ప‌థ‌కాల్లో మిగ‌తా ప‌థ‌కాల‌ను ప‌క్క‌న‌పెడితే... రైతుల‌కు స‌ర్కారీ పెట్టుబ‌డి సాయం కోస‌మంటూ టీడీపీ ప్ర‌క‌టించిన అన్నదాతా సుఖీభ‌వ ప‌థ‌కం బాబును నిజంగానే ఓడించేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... ఈ ప‌థ‌కంలో బాబు ముందుగా ప్ర‌కటించిన రూ.10వేల‌లో రూ.6 వేలు కేంద్రం ప్ర‌క‌టించిన ప‌థకంలోనివి. ఇప్పుడు ఈ సొమ్మును బాబు స‌ర్కారు రూ.15వేల‌కు పెంచినా... అందులో కేంద్రం ప్ర‌కటించిన రూ.6వేలు కూడా ఉన్నాయి. అంటే ఈ ప‌థ‌కంలో చంద్ర‌బాబు స‌ర్కారు రైతుల‌కు ఇస్తున్న‌ది రూ.9 వేలే కాగా... రూ.6 వేలు కేంద్రానివ‌న్న‌మాట‌. కేంద్రం త‌న ప‌థకం అమ‌లులో భాగంగా నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ఖాతాకు జ‌త చేసే అవ‌కాశాలు లేవు. నేరుగా రైతుల అకౌంట్ల‌లోనే త‌మ వాటా మొత్తాన్ని జ‌మ చేయ‌నుంది. ఈ విష‌యాన్ని నిన్న తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి చాలా స్పష్టంగానే ప్ర‌క‌టించేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌థ‌కాల‌తో ఏమాత్రం సంబంధం లేకుండా కేంద్ర ప‌థ‌కానికి సంబంధించిన నిధుల‌ను నేరుగా రైతుల ఖాతాల్లోనే వేసేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

అంటే కేంద్రం విడుద‌ల చేసే నిధులు నేరుగా రైతుల అకౌంట్ల‌కే చేర‌నున్నాయి. మ‌రి బాబు స‌ర్కారు అన్న‌దాతా సుఖీభ‌వ కింద పోస్ట్ డేటెడ్ చెక్కుల‌ను ఎన్నిక‌ల‌కు ముందుగానే పంపిణీ చేయాల‌ని త‌ల‌పోస్తోంది. ఈ చెక్కుల‌ను మొత్తం రూ.15 వేల‌కు సంబంధించి తొలి విడ‌త చెక్కులుగా పంపిణీ చేసే అవ‌కాశం లేదు. ఎందుకంటే... కేంద్రం త‌న ప‌థ‌కానికి సంబంధించిన నిధుల‌ను నేరుగా రైతుల అకౌంట్ల‌కే బ‌దిలీ చేస్తోంది క‌దా. మ‌రి ఆ రూ.6 వేల‌ను బాబు స‌ర్కారు త‌న చెక్కుల్లో క‌లప‌డం అసాధ్య‌మే. అంటే మోదీ స‌ర్కారు విడుద‌ల చేసే నిధుల‌ను నేరుగా త‌మ బ్యాంకు ఖాతాల్లోనే చూసుకునే రైతులు.... బాబు స‌ర్కారు ఇచ్చే పోస్ట్ డేటెడ్ చెక్కుల‌ను మాత్రం అట్ట‌పెట్టెల్లో ఆ తేదీలు వ‌చ్చేదాకా భ‌ద్రంగా దాచుకోవాల‌న్న మాట‌. ఈ ఒక్క విష‌యం చాలు టీడీపీ ఓడిపోవ‌డానికి అన్న విశ్లేష‌ణ‌లు ఇప్పుడు క‌ల‌కలం రేపుతున్నాయి.


Tags:    

Similar News