సీనియర్ నేతను సైడ్ చేస్తున్న బాబు... ?

Update: 2021-11-05 02:54 GMT
ఆయన టీడీపీలో సీనియర్ మోస్ట్ నేత. రెండు దశాబ్దాల రాజకీయ జీవితం ఆయన సొంతం. ఆయనకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటి అంటే ఈ రోజు వరకూ ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. మహామహులు 2019 జగన్ వేవ్ లో ఓడిపోతే ఆయన మాత్రం విజేతగా నిలిచారు. ఆయనే గంటా శ్రీనివాసరావు. విశాఖ జిల్లా నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గంటా ఒకనాడు టీడీపీ అధినాయకత్వానికి తలలో నాలుకగా ఉండేవారు. ఇపుడు మాత్రం ఆయన మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. తాను గెలిచి పార్టీ ఓడడంతో రాజకీయాల మీద విరక్తిని పెంచుకున్న  గంటా అసలు బయటకు రావడం లేదు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఏ కార్యక్రమాల్లోనూ ఆయన పాలుపంచుకోవడంలేదు.  దాంతో అధినాయకత్వం ఆయన పోకడల పట్ల ఆగ్రహంగా ఉందని ప్రచారం అవుతోంది.

అయితే గంటా లాంటి బిగ్ షాట్ ని వదులుకోవడానికి చంద్రబాబు ఇష్టపడతారా అన్నది కూడా చర్చనీయాంశమే. గంటా అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయనకు ఏపీ అంతా అనుచర వర్గం ఉంది. పైగా బలమైన సామాజికవర్గానికి చెందిన నేత ఆయన. టీడీపీలో ఉన్నపుడు ఉప ముఖ్యమంత్రి అవుతారు అని కూడా ఒక దశలో అంతా భావించారు. ఇపుడు ఏపీలో బలమైన సామాజిక వర్గం రాజకీయ వాటా కోసం పోరాడుతోంది. ఆ సమయంలో గంటా వంటి వారికి కనుక చెక్ పెడితే ఈ స్థితిలో టీడీపీకే ఇబ్బందికరం అవుతుంది.

అయితే గంటా ఇన్ యాక్టివ్ గా ఉండడం మాత్రం అధినాయకత్వం అసలు సహించలేకపోతోంది. దాంతో ఆయన్ని సైడ్ చేస్తున్నారు అన్న చర్చ కూడా వస్తోంది. ఇది వత్తిడి పెంచే వ్యూహమే అంటున్నారు. మరో వైపు చూసుకుంటే గంటా మనసులో ఏముందో తెలుసుకోవడానికి అధినాయకత్వం ఆయన మీద దృష్టి పెట్టింది అంటున్నారు. గంటా చూపు ఈసారి కూడా వేరే పార్టీల మీద ఉంది అంటున్నారు. ఆయన జనసేనలో చేరుతారు అన్న ప్రచారం కూడా ఉంది. అదే కనుక నిజమైతే టీడీపీ అధినాయకత్వం ఆయన్ని పట్టించుకోకపోవడమే బెటర్ అంటున్నారు.

ఇప్పటికే జనసేనలో చేరడానికి గంటా లాంచనంగా నిర్ణయం తీసుకున్నారని, సరైన టైమ్ లో ఆయన బయటకు వస్తారని అంటున్నారు. మరి జనసేనకు, టీడీపీకి పొత్తు ఉంటే గంటా సంగతేంటో కూడా చూడాలి. ఏది ఏమైనా ఎక్కడ ఉన్నా గంటా తన మాటను నెగ్గించుకుంటారు. అలాంటి పరిస్థితి ఉంటేనే ఆయన పార్టీ మారుతారు. ఆయనకు ఉన్న ఓటమెరుగని ప్రతిష్టే పెట్టుబడిగా ముందుకు సాగుతారు. అయితే గంటా అనుచరులు మాత్రం తమ నేత పార్టీ మారరు అని చెబుతున్నారు. ఆయన టీడీపీలోనే ఉంటారు అంటున్నారు. కానీ అధినాయకత్వానికి గంటాకు మధ్య అతి పెద్ద గ్యాప్ అయితే ఉందని వస్తున్న వార్తలు మాత్రం చర్చకు తావిస్తున్నాయి. గంటా టీడీపీలో సముచిత స్థానం కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆయనకు తగిన అవకాశం ఇస్తే మళ్లీ ఆయన యాక్టివ్ అవుతారు అంటున్నారు. మరి గంటా కావాలని సైడ్ అయ్యారా. లేక అధినాయకత్వం సైడ్ చేస్తోందా. అసలు గంటా పొలిటికల్ రూట్ ఏంటి అన్నది తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News