చివరికి దేవాన్ష్‌ నూ ప్రచారంలో వాడేశాడు

Update: 2019-04-07 16:01 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశాలు రోజురోజుకీ సన్నగిల్లుతుండడంతో టీడీపీ చంద్రబాబు అన్ని వనరులనూ ఉపయోగించుకుని ప్రచారం చేస్తున్నారు. చివరకు తన మనవడు దేవాన్ష్‌ నూ ఎన్నికల ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
    
కృష్ణా జిల్లాలోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎన్నికల ప్రచార సభకు చంద్రబాబుతో పాటు బ్రాహ్మణి, దేవాన్ష్ కూడా రావడంతో  అంతా ఆశ్చర్యపోయారు. పదవులపై ఎంత ఆశ ఉంటే మాత్రం చిన్నపిల్లలను కూడా ప్రచారంలోకి తీసుకొస్తారా అని టీడీపీ నేతలే గుసగులాడుకున్నారు.
    
కోడలిని, మనవడిని వెంటబెట్టుకుని వచ్చిన చంద్రబాబు ఈ సభలో చాలా డ్రామా క్రియేట్ చేశారు. బ్రాహ్మణిని వేదిక ముందు టీడీపీ జెండా పట్టుకుని కూర్చోబెట్టారు. ఆమె పక్కనే దేవాన్ష్ కూర్చున్నాడు. ఆ తరువాత చంద్రబాబు తన ప్రసంగం ప్రారంభించి దేవాన్ష్‌ ను ఎందుకు తీసుకొచ్చారో చెబుతూ సెంటిమెంటు రగిలించే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా తమ కుటుంబ సభ్యులేనని, దేవాన్ష్ ను వారికి పరిచయం చేస్తానని, తనలోని ఫైర్ ను చూపిస్తానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మనవడు, మనవరాళ్లు తెలుగుదేశం ప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నారని చెప్పారు.
    
పిల్లలను స్కూలుకి పంపితే తల్లిదండ్రులకు రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. కాగా వైసీపీ మేనిఫెస్టోలో ఇలాంటి పథకమే ఉంది. పిల్లలను స్కూలుకి పంపే తల్లులకు రూ.15 వేలు ఇస్తామని జగన్ ప్రకటించారు. కానీ, టీడీపీ మేనిఫస్టోలో అలాంటి పథకమేమీ లేకపోవడంతో ఇప్పుడు దేవాన్ష్‌ని తెచ్చి సెంటిమెంట్ రేపుతూ చంద్రబాబు వైసీపీ పథకంపై రూ.3 వేలు పెంచి ప్రకటించారు.
    
మరోవైపు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చే భృతిని 3000 రూపాయలకు పెంచుతానని చెప్పారు. తాను ఇచ్చే మూడు వేల రూపాయలతో తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని ఆయన సూచించారు. జాబు రావాలంటే.. బాబు రావాలనే నినాదాన్ని నిజం చేశామని అన్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలో 30 లక్షల ఉద్యోగాలను ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. మరోసారి తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపల.. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తాను సృష్టించిన ఐటీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, సిలికాన్ వేలీలో లక్షల రూపాయల వేతనానికి పని చేస్తున్నారని అన్నారు.  ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా నిరుద్యోగ భృతిని వర్తింపజేస్తామని చెప్పారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీమాంధ్రులను అత్యంత అవమానకరంగా స్వరాష్ట్రానికి పంపించారని చంద్రబాబు ఆరోపించారు.. సీమాంధ్రులను కుక్కలుగా, రాక్షసులుగా తిట్టారని ధ్వజమెత్తారు. ఈ మాటలు వింటే పౌరుషం రావట్లేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను తాను ఎప్పటికీ సమర్థించబోనని, ఆ పని ఎవరు చేసినా.. వారిని విడిచిపెట్టబోనని అన్నారు. మొత్తానికి చంద్రబాబు దేవాన్స్‌ను ప్రచారంలోకి తేవడం మాత్రం ప్రజలు నవ్వుకునేలా చేసింది.


Tags:    

Similar News