ఆ ఎంపీ ఇంట నారా, నంద‌మూరి కుటుంబాలు.. విభేదాలు తొల‌గిన‌ట్టేనా?

Update: 2022-08-01 08:36 GMT
విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని రాజ‌కీయాలు సాధార‌ణ ప్ర‌జ‌లకు అర్థం కావ‌డం లేదు. ఇటీవ‌ల పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా మీడియాతో ఆఫ్ ది రికార్డు మీడియాతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ గెల‌వ‌ద‌ని కేశినేని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా సీఎం ర‌మేష్ పార్టీలో చీలిక కూడా తెస్తాడంటూ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. నాని కామెంట్ల‌కు సీఎం ర‌మేష్ సైతం నాని పేరు ఎత్త‌కుండా మీ పని మీరు చూసుకోవాలంటూ ఘాటుగా స్పందించారు.

మ‌రోవైపు త‌న సోద‌రుడు కేశినేని చిన్నితో కేశినేని విభేదాలు రోడ్డెక్కాయి. త‌న ఎంపీ స్టిక్క‌ర్ ను కారుపై వినియోగిస్తూ ఒక వ్య‌క్తి తిరుగుతున్నాడ‌ని కేశినేని నాని ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న స్టిక్క‌రును త‌న సోదరుడు వినియోగిస్తున్నాడ‌ని తెలిసే కేశినాని నాని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

వచ్చే ఎన్నిక‌ల్లో విజ‌యవాడ లోక్ స‌భ స్థానం నుంచి కేశినేని నానికి బ‌దులుగా కేశినేని చిన్ని టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తాడ‌ని.. చంద్ర‌బాబు సైతం చిన్నివైపే మొగ్గు చూపుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎంపీ కేశినేని త‌న కుమార్తె, విజ‌యవాడ కార్పొరేటర్ శ్వేత‌కు నిశ్చితార్థ వేడుక నిర్వ‌హించారు. హైద‌రాబాద్ లో ఒక స్టార్ హోట‌ల్ లో నిర్వ‌హించిన‌ ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్, ఆయ‌న స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి, నంద‌మూరి బాల‌కృష్ణ స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌తోపాటు వివిధ పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు.

అయితే టీడీపీ అధిష్టానంతో ఉప్పూనిప్పుగా వ్యవ‌హ‌రిస్తున్న సంద‌ర్భంలో కేశినేని కుమార్తె నిశ్చితార్థానికి చంద్ర‌బాబు, లోకేష్, బ్రాహ్మ‌ణి, బాల‌య్య భార్య వ‌సుంధ‌ర రావ‌డం విశేషంగానే చెప్పాలి. ఈ క‌ల‌యిక ద్వారా త‌మ‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు కేశినేని నాని చెక్ పెట్టేసిన‌ట్టేనా అని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. చంద్ర‌బాబు, లోకేష్ ల‌తో క‌ల‌సి ఉన్న కేశినేని నాని ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

కాగా ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామనాధం కాజా మనవడు రఘుతో శ్వేతకు నిశ్చితార్థం జరిగింది. శ్వేత అమెరికాలో చదువుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి కేశినేని నాని విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ త‌మ మేయ‌ర్ అభ్య‌ర్థిగా శ్వేత‌నే ప్ర‌క‌టించింది. అయితే టీడీపీ కార్పొరేష‌న్ లో విజ‌యం సాధించ‌లేదు. వైఎస్సార్సీపీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ను త‌న్నుకుపోయింది.
Tags:    

Similar News