ప‌ద‌వుల కోసం మాజీ న్యాయ‌మూర్తుల ఆరాటం: చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2021-12-16 12:30 GMT
``ఏపీలో జ‌గ‌న్ పాల‌న‌ను మెచ్చుకునేందుకు మాజీ న్యాయ‌మూర్తులు పోటీ ప‌డుతున్నారు. ఒకాయ‌న సుప్రీం కోర్టులో ప‌నిచేసి రిటైర్ అయ్యారు. ఆయ‌న కొడుకుకు..ఏపీలో మంచి ప‌ద‌వి ఇప్పించుకున్నారు. దీంంతో ఆయ‌న‌కు ఏపీలో అంతా బాగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అరాచ‌కాలు జ‌రుగుతున్నా.. అద్భుత మ‌నే చెబుతు న్నారు.

ఎస్సీలు, బీసీలపై దాడులు జ‌రుగుతున్నా... ఏమీ ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రొకాయ‌న త‌మిళ‌నాడులో మాజీ న్యాయ‌మూర్తి అంట‌. ఆయ‌న ఇక్క‌డ‌కు వ‌చ్చి.. స‌ర్టిఫికెట్లు ఇస్తున్నారు. వీరంద‌రికి ప‌ద‌వులు కావాలి. ప్ర‌జ‌లు ఎలా పోయినా ఫ‌ర్వాలేదు`` అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

కొద్ది రోజుల కింద‌ట జ‌రిగిన జాతీయ మాన‌వ‌హ‌క్కుల దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకుని.. త‌మిళ‌నాడులోని మ‌ద్రాస్ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి.. జ‌స్టిస్ చంద్రు.. విజ‌య‌వాడ వ‌చ్చారు. దీనికి రెండు రోజుల ముందు.. మాన‌వ హ‌క్కుల నేప‌థ్యంలో వ‌చ్చిన జైభీమ్ చిత్రంపై ఆయ‌న మాట్లాడారు. ఇందులో న్యాయ‌వాది పాత్ర‌కు తానే డైలాగులు రాశాన‌ని చెప్పారు.

ఇక‌, అక్క‌డితో ఆగ‌కుండా.. ఏపీ వ‌ర్సెస్ హైకోర్టు వివాదాన్ని తెర‌మీదికి తెచ్చారు. మూడు రాజ‌ధానుల బిల్లును ప్ర‌భుత్వం.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతోనే వెన‌క్కి తీసుకుంద‌ని అన్నారు.

ప్ర‌తిప‌క్షాలు, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తో చేయాల్సిన యుద్ధాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌తో చేయాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. వాక్ స్వాతంత్య్రం మేర‌కు.. కోర్టు లు ఇచ్చే తీర్పులపై కామెంట్లు చేయ‌డం త‌ప్పులేద‌ని అన్నారు.

అంత‌మాత్రానికే ఈ కేసుల‌ను సీబీఐకి ఎలా అప్ప‌గిస్తార‌ని ప్ర‌శ్నించారు. కాగా, జ‌స్టిస్ చంద్రు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పైఊ స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మైంది. పౌర సంఘాలుకూడా చూచాయ‌గా ఆయ‌న‌ను త‌ప్పుబ‌ట్టాయి. ఎందుకంటే.. ఆయ‌న మాజీ న్యాయ‌మూర్తి కాబ‌ట్టి.. ఎవ‌రూ నేరుగా ఆయ‌న‌ను అన‌లేదు.

ఇక‌, ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు కూడా స్పందించారు. పేరు పెట్ట‌కుండానే..చంద్రుకు కొన్ని స‌వాళ్లు రువ్వారు. ``రండి.. ఏపీలో ప‌ల్లెప‌ల్లెకు తిర‌గండి.. ఇక్క‌డ పాల‌న ఎలా ఉందో ప్ర‌జ‌ల‌ను అడగండి.. రాజ‌కీయ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టండి.. పౌర స‌మాజాన్ని అడ‌గండి.. మీకు వాస్త‌వాలు తెలుస్తాయి. డాక్ట‌ర్ సుధాక‌ర్ ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. ప్ర‌జా సేవ‌లో ఉన్నారు.

ఆయ‌న‌ను చేతులు విర‌గ‌దీసి క‌ట్టి ఒక ఉగ్ర‌వాది కంటే ఘోరంగా అరెస్టు చేశారు. ఎస్సీ మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌లేకుండా పోయింది. లాయ‌ర్లకు ర‌క్ష‌ణ క‌రువైంది. అక్ర‌మ కేసులు పెడుతున్నారు. అప్పుడు మీరు మాట్లాడండి.. అప్పుడు మీరు స‌ర్టిఫికెట్లు ఇవ్వండి!`` అని చంద్ర‌బాబు జ‌స్టిస్ చంద్రుకు స‌వాల్ రువ్వారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు చేసిన కామెంట్లు.. సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.



Tags:    

Similar News