చంద్రుళ్ల‌కు చుక్క‌లు చూపిస్తున్న మిర్చి ఘాటు

Update: 2017-05-02 04:39 GMT
అధికారంలో ఉన్నప్పుడు ఆత్మ‌విశ్వాసం పాళ్లు ఎక్కువ‌గా ఉండ‌టం మామూలే. ప‌వ‌ర్ కున్న‌ల‌క్ష‌ణం అలాంటిది. కానీ.. ఆభ‌ర‌ణంగా ఉండే ఆత్మ‌విశ్వాస‌పు పాళ్లు పెరిగిన కొద్దీ అహంకారం ఆటోమేటిక్ గా వ‌చ్చేస్తుంది. దీనితో వ‌చ్చే న‌ష్టం ఏమిటంటే.. స‌మ‌స్యె ఎలాంటిదైనా.. దాని మూలాల్ని చూసి.. సాల్వ్ చేద్దామ‌నుకునే వాస్త‌విక ధోర‌ణి నుంచి ఆ.. ఏముందిలే ఇదో పెద్ద విష‌య‌మా? డీల్  చేసేద్దామ‌న్న భావ‌న క‌లుగుతుంది. స‌మ‌స్య తీవ్ర‌త అధినేత‌ల‌కున్న ఆత్మ‌విశ్వాస‌పు పాళ్ల‌తో త‌గ్గి క‌నిపిస్తుంది. ఇలాంటి త‌ప్పులకు కొన్నిసార్లు మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ప‌రిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. త‌మ‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా ఫీల‌య్యే ఇద్ద‌రు చంద్రుళ్లు.. ఇప్పుడు ఒకే స‌మ‌స్య‌పై ఒకేలాంటి ఒత్తిడికి గురి కావ‌టం క‌నిపిస్తుంది. కార‌ణాలు ఏమైనా.. మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నార‌న్న‌ది స‌త్యం. ఈ స‌మ‌స్య ఇప్ప‌టికిప్పుడుపుట్టుకొచ్చిందేమీ కాదు. జ‌న‌వ‌రి నుంచి ఉన్న‌దే.

కానీ.. స‌మ‌స్య తీవ్ర‌త ను గుర్తించ‌టంలో ఇద్ద‌రు చంద్రుళ్ల అంచ‌నా త‌ప్పు కావ‌టం.. ఈ ఇష్యూ త‌మ ప్ర‌భుత్వానికి ఎంత ఇబ్బందిగా మారుతుంద‌న్న విష‌యాన్ని ప‌సిగ‌ట్ట‌టంలో విఫ‌లం కావ‌టం ఇప్పుడు ఇష్యూగా మారింద‌ని చెప్పాలి. మిర్చి దిగుబ‌డి భారీగా రావ‌టం.. మార్కెట్ ధ‌ర అంత‌కంత‌కూ త‌గ్గిపోవ‌టంతో మిర్చి రైతులు హాహాకారాలు చేస్తున్నారు. గ‌త ఏడాది వంద కిలోల మిర్చికి రూ.12 వేల నుంచి రూ.14వేల వ‌ర‌కూ రాగా.. ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.5 వేల మ‌ధ్య‌నే రావ‌టం స‌మ‌స్య‌కు ప్ర‌ధాన కార‌ణం.

పంట ఎక్కువైంద‌ని చెప్పినా.. మ‌రొక‌టి చెప్పినా..మిర్చి రైతులు అయితే తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నార‌న్న‌ది నిజం. దీన్ని ఎలా డీల్ చేయాల‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌టం.. స‌న్న‌ద్ధంగా ఉండ‌టంలో జ‌రిగిన పొర‌పాటు ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు ఇప్పుడు మ‌హా ఇబ్బందిగా మారింది. త‌మ‌ది ధ‌నిక రాష్ట్ర‌మ‌ని త‌ర‌చూ చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరును మిర్చి రైతులు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. ధ‌నిక రాష్ట్ర‌మైతే.. రైతుల్ని ఆదుకోవాల్సి ఉన్నా ఎందుకు ఆదుకోవ‌టం లేద‌ని నిల‌దీస్తున్నారు. మిర్చి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై కేంద్రానికి లేఖ రాశామ‌ని.. కేంద్రం ఇచ్చే సాయం కోసం ఎదురుచూస్తున్నామ‌ని చెప్పే మాట‌ల‌కు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ధ‌నిక రాష్ట్రం అయినా తెలంగాణ‌లో రైతు ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు త‌న‌కు తానుగా నిర్ణ‌యం తీసుకొని.. రైతుల్ని ఎందుకు ఆదుకోలేక‌పోతోంద‌న్న ప్ర‌శ్న‌కు గులాబీ శ్రేణులు సూటిగా స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నాయి. కేసీఆర్ చెప్పే సంప‌న్న మాట‌లు రైతుల స‌మ‌స్య‌ల‌కు వ‌ర్తించ‌వా? అని నిల‌దీస్తున్నారు.

దీంతో.. త‌మ‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా ఫీల్ అవుతున్న తెలంగాణ రాష్ట్ర స‌ర్కారుకు తాజా ప‌రిణామాలు మ‌హా ఇబ్బందిక‌రంగా మారాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ఏపీ స‌ర్కారుది ఇదే ప‌రిస్థితి. తాను చేస్తున్న క‌ష్టం మ‌రెవ‌రూ చేయ‌టం లేదంటూ త‌ర‌చూ చెప్పుకునే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. మిర్చి రైతుల్ని ఆదుకునే విష‌యంలో మ‌రింత చొర‌వ‌ను ఎందుకు ప్ర‌ద‌ర్వించ‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌. రైతుల‌కు రూ.1500 ఇవ్వ‌టంతోనే త‌న ప‌ని అయిపోయింద‌న్న‌ట్లుగా భావిస్తున్న‌చంద్ర‌బాబు.. ధ‌ర‌ల్ని స్థిరీక‌రించే విష‌యంలో త‌న వైఫ‌ల్యాన్నిదాచిపెట్టుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. దీనికి తోడు ఏపీలో ఉన్న బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం కార‌ణంగా.. మిర్చి రైతుల ఇష్యూల మీద విప‌క్షం చేస్తున్న పోరాటంతో ఏపీ అధికార‌ప‌క్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. త‌మంత శ‌క్తివంతులు రెండు రాష్ట్రాల్లో మ‌రెవ‌రూ లేర‌న్న‌ట్లుగా ఫీల‌య్యే ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు మిర్చి రైతుల ఇష్యూ కొత్త కోరుగా మారి.. ఇద్ద‌రిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News