చంద్రబాబును గుర్తుకు తెస్తున్న కేసీఆర్

Update: 2020-03-04 04:47 GMT
రాజకీయంగా చంద్రబాబును చాలామంది తప్పు పట్టొచ్చు. కానీ.. ఏదైనా సంక్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు.. విపత్తు విరుచుకుపడినప్పుడు తెలుగు ప్రజలకు చప్పున గుర్తుకొచ్చే పేరు నారా చంద్రబాబునాయుడు. పొలిటికల్ లైన్ లో ఆయన్ను తప్పు పట్టే వారు సైతం.. బాబులోని ఆడ్మినిస్ట్రేటర్ కు మాత్రం ఆడ్మైర్ అయిపోతుంటారని చెప్పక తప్పదు. హూదూద్ తుపాన్ కారణంగా విశాఖపట్నం అతలాకుతలమైన వేళ.. తానక్కడే ఉండి.. అక్కడున్న సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయటంతో పాటు.. ఉద్యోగుల్ని పరుగులు పెట్టించి పనులు పూర్తి చేసిన ఘనత బాబుదేనని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఏ విపత్తు మీద పడ్డా.. బాబు గుర్తుకు వస్తుంటారు. తాజాగా తెలంగాణలో కొవిడ్ వైరస్ పాజిటివ్ కేసు ఒకటి తెర మీదకు వచ్చిన తర్వాత కానీ రాష్ట్ర మంత్రి ఈటెల రివ్యూ మీటింగ్ ను హడావుడిగా పెట్టి.. వివిధ విభాగాలకు ఆదేశాలుజారీ చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పొరుగున ఉన్న చైనాలో కరోనా విశ్వరూపాన్ని చూపించిన వేళ.. మన దగ్గరకు వస్తే ఏం చేయాలి? ఎంత సన్నద్దతతో ఉండాలి? ఎలాంటి ఏర్పాట్లు చేసుకొని ఉండాలి? ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి? మాస్కులు.. శానిటైజర్లు.. మందులు.. ఇలాంటివాటికి పెద్ద ఎత్తున నిల్వ ఉంచేలా చేయటం.. వైరస్ బారిన ఎంతమంది పడినా.. వారికి తక్షణం వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను ఈపాటికే చేయాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నంగా.. ఒక పాజిటివ్ కేసు కన్ఫర్మ్ అయిన తర్వాత రూ.100 కోట్ల బడ్జెట్ ను కేటాయించిన తీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు.

కేరళలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిని వైరస్ బారి నుంచి తప్పించే విషయంలో సక్సెస్ అయిన విధానాన్ని అధ్యయనం చేయటానికి ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక టీంను పంపాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇలాంటివి ముందే చేయాల్సి ఉందంటున్నారు. కరోనా పాజిటివ్ కేసుతో హైదరాబాదీయులు భయం గుప్పిట్లో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఇప్పటివరకూ ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వకపోవటాన్నిపలువురు ప్రస్తావిస్తున్నారు.

విడి రోజుల్లో సరే.. అపత్ సమయంలో మీకేం ఫర్లేదు.. మేం అన్ని చూసుకుంటున్నామన్న ధీమాతో కూడిన మాట సారు నోటి రాకపోవటాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. ఏర్పాట్లు ఎంత వేగంగా ఉండేవన్న వైనాన్ని పలువురు ప్రస్తావించటం గమనార్హం. మరీ.. విషయాలన్ని సారు వరకూ వెళుతున్నాయా? అన్నది అసలు ప్రశ్న.
Tags:    

Similar News