చినబాబుకి మంత్రి పదవి ఇస్తానన్న బాబు

Update: 2017-02-03 04:34 GMT
తెలుగు తమ్ముళ్లు ఎంతో కాలం చూస్తున్న రోజు వచ్చేసింది. తమ భవిష్యత్ నాయకుడైన చినబాబును మంత్రిని చేయాలన్న డిమాండ్ పై బాబే స్వయంగా రియాక్ట్ అయ్యారు. చేతిలో అధికారం ఉన్న వేళ.. అందరికి పదవులిచ్చే బాబు.. కొడుక్కి ఎందుకు ఇవ్వలేన్న చర్చ తరచూ జరిగేది. దీనికి తెలుగుదేశం నేతలు చిత్రమైన వాదనను వినిపించేవారు. తమ అధినాయకుడు కుటుంబ సభ్యులకు పదవులిచ్చే సంస్కృతికి దూరమని.. అందుకే పార్టీ పదవి తప్పించి.. మంత్రి పదవి ఇవ్వలేదని.. విలువల కోసం తమ అధినేత తపిస్తుంటారని గొప్పలు చెప్పుకునేవారు.

ఇకపై అలాంటి మాటలు చెప్పుకునే అవకాశం లేదనే చెప్పాలి. చేతిలో పవర్ ఉన్న నేపథ్యంలో కొడుకును మంత్రిని చేసే విషయంలో చంద్రబాబు.. మిగిలిన నేతల మాదిరే వ్యవహరించారే తప్ప.. ఇప్పటివరకూ అనుసరించిన వైఖరిని పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా చెప్పాలి.

తాజాగా తెలంగాణ తెలుగుదేశం నేతలతో వెలగపూడిలో భేటీ అయిన చంద్రబాబు.. మాటల మధ్యలో లోకేశ్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్న విషయాన్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం చినబాబుకు మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న అంశం పలు సందర్భాల్లో తెరపైకి వచ్చినా రియాక్ట్ అయ్యింది లేదు. కానీ.. ఈసారి మాత్రం ఎవరూ అడగకుండానే చంద్రబాబు తనకు తాను.. ప్రకటించటం గమనార్హం.  అయితే.. మంత్రి పదవిని ఎప్పుడు కట్టబెడతారు? ఉప ఎన్నిక ద్వారా? ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా నియమిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం..త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లోకేశ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి.. అనంతరం మంత్రి పదవిని అప్పగించే వీలుందని చెబుతున్నారు. బాబు ప్రకటనతో చినబాబుకు అప్పగించే శాఖలు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానున్న మరికొద్ది రోజుల్లో ఈ అంశాలపై స్పష్టత వస్తుందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News