అడగందే అమ్మే పెట్టదన్నది మరిస్తే ఎలా బాబు?

Update: 2016-03-01 22:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విపరీతమైన అసహనానికి గురి అవుతున్నారు. నిజానికి ఆయన అసహనంలో అర్థం ఉంది. అసలుసిసలు మిత్రపక్షంగా వ్యవహరిస్తూ.. తన కారణంగా ఎన్డీయే కూటమికి తలనొప్పులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిత్రధర్మంలో భాగంగా సాయం చేయాల్సి ఉన్నా.. అలాంటిదేమీ లేకుండా ఉన్నప్పటికీ.. తమకు జరుగుతున్న డ్యామేజీపై రోడ్డున పడకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు.

మనసులో ఎంత ఆవేదన ఉన్నా.. దాన్ని బయటకు చెప్పుకుంటే మోడీ సర్కారుకు ఇబ్బందిగా మారుతుందన్న ఒక్క ఆలోచనలో అణిచి పెట్టుకుంటున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండకపోవటం ఆయన్ని విపరీతంగా వేధిస్తోంది. తానెంత హుందాగా ఉన్నప్పటికీ.. ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిపై ఆయన విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో కలిసి హామీలు ఇచ్చామని.. ఈ రోజున బడ్జెట్ లో కేటాయింపులు జరపకుండా ఎలా ఉంటున్నారో అర్థం కావటం లేదన్న ఆవేదనను పార్టీ నేతలతో చంద్రబాబు పంచుకుంటున్నారు. మరికొంత కాలం వేచి చూద్దామన్న ధోరణి ప్రదర్శించాలన్న ఆలోచనలో బాబు ఉన్నట్లుగా అర్థమవుతోంది. అయితే.. ఇలాంటి వేచి చూసే ధోరణి కారణంగా బాబు ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

గడిచిన రెండేళ్లుగా బాబు ఎలా ఉన్నారు? మిత్రధర్మాన్ని ఏ రకంగా నిర్వర్తిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బీజేపీ అగ్రనాయకత్వంతో సహా అందరికి తెలిసిందే. కాకపోతే.. ఇప్పుడు మోడీ అండ్ కోకు తెలియాల్సింది.. తమ ప్రయోజనాల్ని పట్టించుకొకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలిసేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ సందర్భంగా సహనాన్ని వదిలేసి.. బతిమిలాడుకునే ధోరణి మరిచి..తమ హక్కుల సాధన కోసం ఓ మోస్తరు రచ్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత బలమైన వాడైనా పరువు కోసం కిందామీదా పడుతుంటాడు. బలం ఉంది కదా అని బలహీనుడి మీద కొట్లాటకు దిగడు. దిగినా.. అతనికి కలిగే ప్రయోజనం శూన్యం. సరిగ్గా ఇదే లాజిక్ ఏపీకి వర్తిస్తుంది. ఈ రోజు ఏపీ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో దేశం మొత్తానికి తెలిసిందే. ఏపీకి ఏదైనా చేస్తే.. ఎవరో ఏదో అనుకుంటారనే అవకాశమే లేదు. అలాంటప్పుడు.. మొహమాటాల్ని వదిలి పెట్టి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతు విప్పితే పోయేదేముంది?

అడగందే అమ్మ కూడా ముద్ద పెట్టదంటారు. అలాంటిది మోడీ లాంటి రాజకీయ గుజరాతీ ఏపీకి ఏదో చేస్తారనుకోవటం అత్యాశే అవుతుందన్నది మర్చిపోకూడదు. అందుకే.. శషబిషులు మానేసి.. ఏపీ హక్కుల కోసం గళం విప్పాల్సిన సమయం అసన్నమైందని బాబు గుర్తించాలి. లేకుంటే.. మోదీ దగ్గర మర్యాద సంగతేమో కానీ.. ఏపీ ప్రజల నమ్మకాన్ని కోల్పోతారన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News