కేసీఆర్ ను ఫాలో అయితే దెబ్బే బాబు!

Update: 2018-08-18 05:32 GMT
కొన్ని ప‌నులు కొంద‌రు మాత్ర‌మే చేయాలి. వారికి మాత్ర‌మే అలాంటి సామ‌ర్థ్యం ఉంటుంది. ఆ విష‌యాన్ని గుర్తించ‌కుండా తొంద‌ర‌ప‌డితే మొద‌టికే మోసం రావ‌టం ఖాయం. ఈ మ‌ధ్య‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ  సంద‌ర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తున్న‌ట్లు చెప్పేశారు. ఆగ‌స్టు 15న ప్ర‌భుత్వ ప్ర‌గ‌తి నివేదిక వెల్ల‌డిస్తాన‌ని.. అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తామ‌ని.. ఆ త‌ర్వాత అసెంబ్లీ అభ్య‌ర్థుల వివ‌రాల్ని వెల్ల‌డిస్తామ‌ని చెప్ప‌టం తెలిసిందే.

కేసీఆర్ మాట‌ల‌తో.. డిసెంబ‌రులోనే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం అర్థ‌మైంది. ఇదే విష‌యాన్ని ప‌లు మీడియా సంస్థ‌లు వెల్ల‌డించాయి. డిసెంబ‌రులో తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళుతుంద‌న్న విష‌యంపై మీడియా రాసిన క‌థ‌నాల్ని ఏ ఒక్క టీఆర్ ఎస్ నేత ఖండించ‌క‌పోవ‌టంతో.. డిసెంబ‌రులోనే అసెంబ్లీ ఎన్నిక‌లు ప‌క్కా అన్న‌ది ఖాయ‌మైంది.

ఇదిలా ఉంటే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కొన్ని స్థానాల‌కు తాము ముందే అభ్య‌ర్థుల పేర్లు ప్ర‌క‌టిస్తామ‌ని ఏపీ టీడీపీ నాయ‌క‌త్వం ఆలోచిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇందుకు సంబంధించిన సంకేతాల్ని బాబు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఒక‌వేళ‌.. అదే నిజ‌మైతే.. బాబు త‌ప్పులోకాలేసిన‌ట్లే.

డిసెంబ‌రులో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు కాబట్టి.. అందుకు రెండు నెల‌ల ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామంటూ కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న వెనుక ప‌క్కా వ్యూహం ఉంది. అసెంబ్లీ.. లోక్ స‌భ ఎన్నిక‌లు వేర్వేరుగా జ‌రుగుతాయి కాబ‌ట్టి.. అసంతృప్త నేత‌ల్ని బుజ్జ‌గించేందుకు.. స‌ముదాయించేందుకు అవ‌కాశం ఉంది. అన్నింటికి మించి.. ఎవ‌రేం చెప్పినా.. ఈసారి తెలంగాణ‌లో టీఆర్ ఎస్ విజ‌యం ఖాయ‌మన్న విష‌యంపై ఎవ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. రాబోయేది మ‌ళ్లీ కేసీఆర్ స‌ర్కారే కావ‌టంతో.. టికెట్లు రాని అసంతృప్తుల‌ను బుజ్జ‌గించి.. వారికి భ‌విష్య‌త్ అవ‌కాశాలు ఉంటాయ‌న్న భ‌రోసాతో స‌ర్ది చెప్పే వీలుంది. అంటే టికెట్లు ల‌భించ‌ని నేత‌ల్ని బుజ్జ‌గించే వీలు ఎక్కువ‌.

కానీ.. ఇలాంటి ప‌రిస్థితి ఏపీలో లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. తెలంగాణ‌తో పోలిస్తే.. కొన్ని ల‌క్ష‌ల రెట్ల బ‌లంతో ఏపీ విపక్షం ఉంది. గ‌డిచిన కొద్ది రోజులుగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర అధికార‌ప‌క్షంలో గుబులు రేపుతోంది. ఇప్ప‌టికే ప‌లు హామీల‌తో అక్ర‌మంగా త‌మ పార్టీలోకి తీసుకొచ్చిన నేత‌ల‌కు.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీట్లు కేటాయించ‌కుంటే.. జ‌రిగే ర‌భ‌స అంతా ఇంతా కాదు.

అన్నింటికి మించి.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు చంద్ర‌బాబుఏ మాత్రం సుముఖంగా లేర‌న్న విష‌యం తెలిసిందే. త‌న పాల‌న‌పై ఏపీ ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త ఉన్న వేళ‌.. ఎన్నిక‌లు ఎంత ఆల‌స్యంగా జ‌రిగితే అంత మంచిద‌న్న ఆలోచ‌న‌లో ఏపీ అధికార‌ప‌క్షం ఉంద‌ని చెబుతున్నారు. ఇలాంటి వేళ‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే కొంద‌రు అభ్య‌ర్థుల జాబితాను ముందుగా ప్ర‌క‌టించ‌టం అంటే కొరివితో త‌ల‌గోక్కున్న‌ట్లే.  కేసీఆర్ చూసి పోటీ ప‌డాల్సిన అంశాలు వేరే ఉన్నాయ‌న్న‌ది బాబు మిస్ అయి.. గుడ్డిగా ఆయ‌న్ను ఫాలో అయితే భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News