ముస్లీములకు చంద్రబాబు గాలం

Update: 2018-08-25 01:30 GMT
అందితే జుట్టు... అందక పోతే కాళ్లు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరు. భారతీయ జనతా పార్టీతో ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకుని నాలుగేళ్లు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించి.. ప్రధాన మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులలో కలియ తిరిగిన చంద్రబాబు నాయుడుకు ఈ నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు. బాబ్రీ మసీదు కూల్చేసిన హిందూ కార్యకర్తలు గుర్తుకు రాలేదు. కేవలం అధికారం మాత్రమే కళ్ల పడింది. దీంతో ముస్లీంలకు తీవ్ర వ్యతిరేకమైన భారతీయ జనతా పార్టీతో దర్జాగా జత కట్టేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక హోదా గురించి ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో ఇన్నాళ్లూ ముస్లీములను దూరంగా ఉంచిన చంద్రబాబు నాయుడు వారికి దగ్గరయ్యేందుకు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. అది కూడా ఎన్ననుకునేరు.... ఎన్నో కాదు.... కేవలం ఒక్కటంటే ఒక్కటేనట. అది కూడా ముస్లీం మైనార్టీకి చెందిన ఎమ్మెల్సీ షరీఫ్‌ కు మంత్రివర్గంలో స్ధానం కల్పించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను విజయవాడలో కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయమై ఆయనతో చర్చించినట్లు చెబుతున్నారు. శ్రావణ మాసం కావడంతో పాటు మంచి రోజులు కూడా ఉన్నాయని పండితులు చెప్పారని అంటున్నారు. దీనిని ద్రష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ షరీఫ్‌ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన జలీల్ ఖాన్ కు మంత్రి పదవి ఇస్తారని ఆయనతో పాటు పార్టీలో ముస్లీము నాయకులందరూ అనుకున్నారు. అయితే వాడుకుని వదిలేసే నైజం ఉన్న చంద్రబాబు నాయుడు జలీల్ ఖాన్ విషయంలో కూడా అలాగే ప్రవర్తించారని అంటున్నారు. మరోవైపు రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని నివేదికలు అందాయంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో ముస్లీములు ఎక్కువ మంది ఉన్నారు.

వీరి ఓట్లను కొల్లగొట్టేందుకు షరీఫ్ కు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో కూడా అదే చర్చ జరుగుతోంది. ముస్లీములను ఇప్పటి నుంచే దగ్గర చేసుకుని వారి మద్దతుతో మళ్లీ అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు.



Tags:    

Similar News