అమ‌రావ‌తికి 'బ‌స‌వ‌తారకం' వ‌చ్చేసిన‌ట్టే!

Update: 2018-01-28 11:31 GMT
టాలీవుడ్ న‌ట‌సింహం - టీడీపీ నేత‌  -అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ కాసేప‌టి క్రితం టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుతో పాటుగా టీఆర్ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర‌రావుల‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకున్నారు. అయినా బాల‌య్యేమిటీ?... ఇద్ద‌రు చంద్రుల‌కు ఒకేసారి థ్యాంక్స్ చెప్ప‌డ‌మేమిట‌నేగా?  మీ డౌటు. ఇందులో చాలా ప్ర‌త్యేకత ఉందిలెండి. అదేంట‌న్న విష‌యంలోకి వెళితే... సినీ న‌టుడు - రాజ‌కీయ నేత‌గానే కాకుండా బాల‌య్య... ఇంకో కీల‌క బాధ్య‌త‌ను కూడా నెర‌వేరుస్తున్నారు. అదేంటంటే... హైద‌రాబాదులోని జూబ్లీహిల్స్ ప‌రిధిలో ఏళ్ల త‌ర‌బ‌డి పేద ప్ర‌జ‌లకు వైద్య సేవ‌లందిస్తు బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ కేన్స‌ర్ హాస్పిట‌ల్‌కు ఆయ‌న చైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు - స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు త‌న చివ‌రి ద‌శ‌లో ఈ ఆసుప‌త్రిని... త‌న స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పేరు మీద ఏర్పాటు చేశారు. ఖ‌రీదైన కేన్స‌ర్ చికిత్స‌ల‌ను పేద‌ల‌కు అతి త‌క్కువకే అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఆసుప‌త్రి... ప్రారంభ‌మైన నాటి నుంచి వేలాది మంది పేద‌ల‌కు నిజంగానే ప్రాణం పోసింద‌ని చెప్పాలి.

అధికారంలోకి ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా కూడా ఈ ఆసుప‌త్రికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. అందుక్కార‌ణం ఆ ఆసుప‌త్రి పేద‌ల‌కు అందిస్తున్న నిస్వార్థ సేవ‌లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్ని ప‌నుల‌న్నా కూడా ఆసుప‌త్రి వ్య‌వ‌హారాల‌పై నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ చేసే బాల‌య్య‌... ఏటా వార్షికోత్స‌వం నాడు ఆసుప‌త్రికి వెళ్లి రోగుల‌ను ప‌లుక‌రించ‌డంతో పాటుగా... ఆసుప‌త్రి నిర్వ‌హ‌ణ‌పై స‌మ‌గ్ర స‌మీక్ష చేస్తారు. ఇప్ప‌టిదాకా బాగానే ఉన్నా... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఇప్ప‌టికే నాలుగేళ్లు కావ‌స్తోంది. ఈ క్ర‌మంలో బాల‌య్య హైద‌రాబాదులోనే ఉంటున్నా... ఏపీకి చెందిన ఎమ్మెల్యేగా మారిపోయారు. అంతేకాకుండా ఏపీకి చెందిన ప్ర‌జ‌లు తెలంగాణ కేపిట‌ల్‌గా ఉన్న హైద‌రాబాదులోని బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రికి వ‌చ్చి వైద్య చికిత్స‌లు అందుకునే విష‌యంలో కొంత‌మేర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని ప‌రిశీలించిన బాల‌య్య‌... ఏపీలోనూ బ‌స‌వ‌తాక‌రం ఆసుప‌త్రి శాఖ‌ను ఏపీలోనూ ఏర్పాటు చేయాల‌ని త‌ల‌చారు. ఆసుప‌త్రి చైర్మ‌న్ హోదాలో స‌ద‌రు శాఖకు న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌దాని అమ‌రావ‌తిలో స్థ‌లం కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఇందుకు సానుకూల స్పంద‌న రాగానే... మొన్నామ‌ధ్య విదేశాల‌కు ఫ్యామిలీతో పాటు క‌లిసి వెళ్లిన బాల‌య్య‌... స‌ద‌రు శాఖ ఏర్పాటు కోసం అవ‌స‌ర‌మ‌య్యే నిధుల‌ను సేక‌రించే ప‌నిని కూడా పూర్తి చేశారు. తాజాగా స‌ద‌రు ఆసుప‌త్రి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన 15 ఎక‌రాల భూమిని బ‌స‌వ‌తార‌కం ట్ర‌స్టుకు అప్ప‌గిస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు ప‌త్రాల‌ను అందుకున్న బాల‌య్య‌... సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. అంతేకాకుండా వ‌చ్చే నెల‌లోనే ఆసుప‌త్రి నిర్మాణానికి భూమి పూజ చేసి... రెండేళ్ల‌లోనే ఆసుప‌త్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తాన‌ని, ఆ మ‌రుక్ష‌ణం నుంచే ఏపీకి చెందిన పేద‌ల‌కు బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ప్ర‌కటించారు. అదే స‌మ‌యంలో హైద‌రాబాదులోని బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా స‌హక‌రిస్తున్న తెలంగాణ స‌ర్కారు తోడ్పాటును గుర్తు చేసుకున్న బాల‌య్య‌... తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలిపారు.
Tags:    

Similar News