ఓటుకు నోటు.. బాబు చట్టబద్దం చేసినట్టే!?

Update: 2019-02-06 08:27 GMT
అసెంబ్లీ చివరి బడ్జెట్ సమావేశాలు అధికార - ప్రతిపక్షాలకు కీలకంగా మారాయి. అధికారపక్షం తమపై ఐదేళ్లలో ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకతను తొలగించుకునేందుకు తాయిలాలు ప్రకటించేందుకు సిద్ధమవుతుండగా.. ప్రతిపక్షాలు ఐదేళ్లలో పాలకపక్షం అసమర్థతను గట్టిగా వినిపించి ప్రజల్లో మార్కులు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మొన్నటి కేంద్ర బడ్జెట్ కూడా ప్రజలపై వరాల వాన కురిపించింది. ఇప్పుడు ఏపీ రాష్ట్ర బడ్జెట్ లోనూ అంతే స్థాయిలో ప్రజలను ఆకట్టుకోవడానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలను చూస్తే స్థూలంగా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ప్రజల్లోని వ్యతిరేకతను - హామీల అమలులో జాప్యంపై అనుమానాలు చివరి బడ్జెట్ ప్రతిపాదనల్లో కనిపించనుంది.

ప్రజలపై నోట్ల వర్షం కురిపించి.. ఓట్లు పట్టే ఎత్తుగడగానే చివరి బడ్జెట్ సమావేశాలు కనిపిస్తున్నాయి. ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేల విడిచి సాము చేయడానికి రెడీ అవుతున్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా ఏపీ సర్కారు ప్రవేశపెట్టి 2.26 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ లో సంక్షేమం అనే మాటను ఉచ్చరించడం ప్రధాన జిమ్మిక్కుగా కనిపిస్తోంది. మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. అందుకే పింఛన్లు పెంచేసి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. నిరుద్యోగ భృతి పేరిట 1000 రూపాయల భృతిని 2000కు పెంచుతోంది. మహిళల కోసం పసుపు కుంకుమ పేరుతో కొత్త పథకం పెట్టి వారికి 4000 కోట్లను ఏపీ సర్కారు విదిల్చుతోంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం 5000 కోట్లు కేటాయిస్తోంది. దీనికి తోడు ఆరు పథకాలతో రైతులను ఆకర్షిస్తోంది.

దీన్ని బట్టి చూస్తే కేవలం ఓట్ల కోసమే ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.చంద్రబాబు ప్రభుత్వానికి ఓట్లే తప్ప.. ప్రజల సంక్షేమం కాదనే విషయాన్ని తాజా బడ్జెట్ తేటతెల్లం చేస్తోంది. రైతులు,వృద్ధులు, వితంతులు, వికలాంగులు  - నిరుద్యోగులు - మహిళలు ఇలా ప్రతి వర్గానికి పైసలు విదల్చుతూ చంద్రబాబు ఓటు బ్యాంకు గా చూస్తున్నారే తప్ప వారి సంక్షేమం కోసం పనిచేయడం లేదని ప్రభుత్వ బడ్జెట్ ను గమనిస్తే తెలుస్తోంది.
Tags:    

Similar News