చంద్రబాబు టీం నుంచి లోకేష్‌ ను తప్పించారా..!

Update: 2019-01-26 01:30 GMT
రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి తన వ్యూహాలకు పదును పెట్టారు. అయితే ఈసారి కూడా చంద్రబాబు తన పాత టీంతోనే కలిసి ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. అయితే.. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కథే నడిచిందని సమాచారం. 2018 తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలోని కొందరు ప్రముఖ నేతలతో కలిసి మంత్రి నారా లోకేష్ తనకంటూ ఓ సొంత స్ట్రాటజీ టీంను ఏర్పాటు చేసుకున్నారట. ఈ కొత్త టీంలో ఉన్న సభ్యులంతా లోకేష్‌ కు మినిట్ టూ మినిట్ అప్‌ డేట్స్ ఇచ్చేవారట. పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి, ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి లోకేష్ ఈ టీంతోనే చర్చలు జరిపివారని సమాచారం. అయితే.. ఇలా టీడీపీలో సరికొత్తగా ఏర్పడిన లోకేష్ అండ్ కో ఘోరంగా విఫలమైందని తెలిసింది.  ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారని టీడీపీలోని ఓ వర్గం ఇప్పటికీ మదనపడిన పరిస్థితి ఉంది.

అయితే.. పార్టీ తరపున తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన అంతర్గత వ్యూహాలన్నింటినీ లోకేష్ అండ్ కోనే రచించిందట. కానీ.. టీఆర్ఎస్ ప్రభంజనం ముందు లోకేష్ టీం ఏమాత్రం పారలేదు సరికదా చంద్రబాబు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చిందట. దీంతో.. ఏపీ ఎన్నికల్లో అలా జరగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు తనకు కలిసొచ్చిన పాత టీంనే మళ్లీ రంగంలోకి దింపినట్లు సమాచారం. ఈ టీం ఏపీ ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా వ్యవహరించనుందని తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. ఈ టీంలో తన కుమారుడు లోకేష్‌కు చంద్రబాబు చోటు కల్పించలేదని జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు పార్టీ కోసం గతంలోనూ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారని, కానీ లోకేష్‌ను పక్కనపెట్టడమంటే.. తన కుమారుడికి మరింత రాజకీయ చతురత అవసరమని చంద్రబాబు భావించి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత కొద్దిరోజులుగా చంద్రబాబు పలు హామీలను గుప్పించడం వెనుక ఈ స్ట్రాటజీ టీం ఉందని తెలుస్తోంది. జగన్‌కు పాదయాత్ర ద్వారా వచ్చిన సానుకూలతను ఇలాంటి ప్రకటనల ద్వారా మెల్లిమెల్లిగా చెరిపివేసి ఎన్నికల నాటికి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలంటే మన ముందున్న మార్గం ఇదొక్కటేనని చంద్రబాబుకు ఈ స్ట్రాటజీ టీం సూచించినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు కూడా ఇదే సరైన మార్గమని భావించి.. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరుతో రూ.10వేలు, స్మార్ట్ ఫోన్.. ఫించన్లు రూ.2వేలు చేస్తున్నట్లు  ప్రకటించినట్లు తెలిసింది. ఏదేమైనా.. రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబు మరోసారి స్పీడ్ పెంచారనే విషయం మాత్రం సుస్పష్టమైంది. అయితే.. ఎంతవరకూ ఈ ప్రకటనలను నమ్మి ప్రజలు టీడీపీకి ఓటేస్తారనేది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఆసక్తికర చర్చ.
Tags:    

Similar News