ఇవాళ కూడా అవే మాట‌లా చంద్ర‌బాబు?

Update: 2017-06-02 04:49 GMT
భావోద్వేగాల‌తో రాజ‌కీయాలు చేయ‌టం ఈ త‌రం రాజ‌కీయనాయ‌కుల‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో. కొంద‌రి నేత‌ల తీరు చూస్తే.. మాట‌ల్లో చూపించే భావోద్వేగాలు చేత‌ల్లో ఎంత‌మాత్రం క‌నిపించ‌వు. విభ‌జ‌న నిర్ణ‌యం కార‌ణంగా కోట్లాది మంది ఆంధ్రోళ్ల గుండెలు బాధ‌తో ఉండే వేళ‌.. దీక్ష‌ల పేరుతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. ఆయ‌న తీరుతో ప‌రిస్థితి ఎలా త‌యారైందంటే.. ఏపీ రాష్ట్రానికి అవ‌త‌రణ దినోత్స‌వం అన్న‌ది లేకుండా చేశారని చెప్ప‌క త‌ప్ప‌దు.

సాంకేతికంగా చూసిన‌ప్పుడు.. ఏపీ రెండు ముక్క‌లైంది 2014 జూన్ 2న‌. ఏపీ నుంచి తెలంగాణ ఒక రాష్ట్రంగా విడిపోయింది. దీంతో.. విడిపోయిన తెలంగాణ ఒక రాష్ట్రంగా అవ‌త‌రించిన దినాన్ని ఆవ‌త‌ర‌ణ దినోత్స‌వంగా ఉత్స‌వాలు చేసుకుంటోంది.

మ‌రి.. ఏపీ రెండు ముక్క‌లైన వేళ‌.. 13 జిల్లాల‌తో కూడిన బుల్లి రాష్ట్రంగా మారిన ఏపీకి రాష్ట్ర ఆవ‌త‌ర‌ణ దినోత్స‌వం మాటేమిటంటే.. విభ‌జ‌న దిన‌మే.. కొత్త‌గా ఆవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌టం బాబుకు మాత్ర‌మే చెల్లింది. ఈ విష‌యం మీద ప‌లువురు ప‌లు వాద‌న‌లు వినిపించినా.. విడిపోయిన రోజును న‌వ‌నిర్మాణ దీక్ష పేరుతో చేప‌ట్టిన  కార్య‌క్ర‌మాల్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

విభ‌జ‌న కార‌ణంగా ఏపీ న‌ష్ట‌పోయింద‌న్న‌ది వాస్త‌వం. దాన్ని గుండెల్లో పెట్టుకొని క‌సిగా ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పే బాబు మాట‌ల్ని కాద‌న‌లేం. కానీ.. విభ‌జ‌న రోజును రాష్ట్ర ఆవ‌త‌ర‌ణ రోజుగా మార్చేసి.. దానికి న‌వ‌నిర్మాణ దీక్ష పేరుతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌ట‌మే జీర్ణించుకోలేనిదిగా చెప్పాలి.

న‌ష్ట‌పోయినంత మాత్రానా.. ఆంధ్రోళ్ల‌కంటూ ఒక ఆవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఉండ‌దా? దాన్ని పండుగ‌లా చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది క‌దా. గుండెల్లో మండే బాధ‌కు దీక్ష పేరుతో భారీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌టం.. అది కూడా ఆరు రోజుల పాటు అని చెప్పే బాబు మాట‌లకు న‌వ్వాలో.. ఏడ‌వాలో అర్థం కాద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు. ఈ దీక్ష దినాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన కాలంలో ప్ర‌భుత్వం ఏమేం చేసింద‌న్న‌రివ్యూ.. రానున్న‌రోజుల్లో ఏమేం చేయాల‌న్న అంశాల మీద చ‌ర్చిస్తామ‌ని ఆయ‌న చెబుతుంటారు. కానీ.. విభ‌జ‌న దినం ఆవిర్భావ దినంగా ఎందుకు మార్చార‌న్న విష‌యాన్ని ఆంధ్రోళ్ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌రు.

దీక్ష పేరుతో రివ్యూలు.. ప్ర‌తిన చేయ‌టం లాంటివి ఎన్ని చేసినా.. మ‌న‌సులో క‌మిట్ మెంట్ లేనంత కాలం ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇదిలాఉంటే.. జూన్ 2ను న‌వ‌నిర్మాణ దీక్షగా ఆంధ్రోళ్లు ఎంత మాత్రం అంగీక‌రించే స్థితిలో లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. కానీ.. అధికారంలో ఉన్న బాబు పుణ్య‌మా అని అలాంటి వాయిస్ లు బ‌య‌ట‌కు రాకుండాపోవ‌టం.. ఆయ‌న చెప్పేవి మాత్ర‌మే మీడియాలో తాటికాయంత అక్ష‌రాల‌తో ప‌డుతున్న వేళ‌.. ఆంధ్రోళ్ల మ‌న‌సుల్లో ఏం ఉందో చెప్పే వారే లేకుండా పోయారని చెప్ప‌క త‌ప్ప‌దు..

త‌న‌దైన మొండిత‌నంతో త‌న కోసం కాద‌ని.. ఐదు కోట్ల ఆంధ్రుల కోస‌మే మ‌హా సంక‌ల్పాన్ని చేస్తున్న‌ట్లుగా చంద్ర‌బాబు చెబుతారు. ప్ర‌తిఒక్క‌రి జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌డాల‌ని.. స‌మాజాభివృద్దికి పున‌రంకితం కావాల‌ని పిలుపునిచ్చే చంద్ర‌బాబు.. గ‌డిచిన మూడేళ్ల పాల‌న‌లో ఆంధ్రోళ్ల బ‌తుకుల్ని అంత‌గా ఏం మార్చారో ఒక్క‌మాట‌లో  ఆయ‌న చెబితే స‌రిపోదా? అందుకోసం ఇన్నేసి రోజులు దీక్ష‌ల పేరుతో కార్య‌క్ర‌మాలు చేయ‌టం ఏమిటో. ఒక‌వేళ చేసినా.. దాని వ‌ల్ల  ప్ర‌యోజ‌నం జ‌రిగితే ఫ‌ర్లేదు. కానీ.. ప్ర‌చారం కోస‌మే త‌ప్పించి ఎలాంటి ప్ర‌యోజ‌నం లేని కార్య‌క్ర‌మాన్ని భుజాన వేసుకొని ప్ర‌చారం చేస్తున్న‌ది ఎందుకు? ఏపీ ప‌ట్ల త‌న‌కున్న క‌మిట్ మెంట్ ను ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికా? అన్న సందేహం రాక మాన‌దు.  

ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని విభ‌జించార‌ని.. రాష్ట్ర ఆవ‌త‌ర‌ణ‌ను పండ‌గ‌గా చేసుకోలేమ‌ని.. అలా అని నీర‌సించి కుంగిపోయి సాధించేది ఏమి ఉంటుంద‌ని ప్ర‌శ్నించే చంద్ర‌బాబు.. అందుకే జూన్ 2న న‌వ‌నిర్మాణ దీక్ష చేస్తున్న‌ట్లుగా చెబుతారు. ఆంధ్రోళ్లు త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఫీల‌య్యే రోజున నిర్వ‌హించే ఏ కార్య‌క్ర‌మం అయినా.. అదే పేరుతో ఉన్నా.. దాన్ని జ‌రుపుకోవ‌టానికి ఎంత‌వ‌ర‌కు సిద్ధంగా ఉన్నార‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌. అలాంటివేమీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని చంద్ర‌బాబు.. దీక్ష పేరు చెప్పి చేస్తున్న కార్య‌క్ర‌మాలు ప‌లువురి మ‌నోభావాల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయ‌న్న మాట వినిపిస్తోంది.

మొత్తంగా చూస్తే బాబు చేస్తున్న దీక్ష పుణ్య‌మా అని ఆంధ్రోళ్ల‌కు రాష్ట్ర ఆవ‌త‌ర‌ణ దినోత్స‌వం అన్న‌ది లేకుండా చేశార‌ని చెప్ప‌టంలో సందేహం లేదు. నిజానికి మ‌ద్రాస్ నుంచి విడిపోయి.. సొంత రాష్ట్రంగా ఏర్ప‌డ‌తామ‌ని పోరాడి సాధించుకున్న‌ న‌వంబ‌రు 1ని.. ఏపీ రాష్ట్ర ఆవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఎందుకు చేసుకోకూడ‌ద‌న్న ప్ర‌శ్న‌కు.. చంద్ర‌బాబు సూటిగా స‌మాధానం చెబితే బాగుంటుందన్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప‌వ‌ర్ లో ఉన్న బాబుకు ఇలాంటి వాద‌న‌లు విని అవ‌కాశం అస్స‌లు ఉండ‌దేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News