ఇలాంటి ఐడియాలు బాబుకు ఇచ్చేదెవరు?

Update: 2016-01-07 04:44 GMT
కొద్ది నెలల క్రితం ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమ సందర్భంగా భారీ ఎత్తున పూజలు.. పునస్కారాలు జరిపించారు. ఏపీ మొత్తం భావోద్వేగంతో కదిలిపోయేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మన నీరు.. మన మట్టి.. మన రాజధాని అంటూ..ఏపీ వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మట్టిని.. నీటిని సేకరించి అమరావతి ప్రాంతానికి తరలించారు.

ఇదంతా జోరుగా సాగుతున్న వేళ.. ప్రచార మోతాదు మరింత పెంచేందుకు వీలుగా.. ‘‘మన అమరావతి మన రాజధాని’’ పేరిట పలకల మీద రాసి ఫోటోలకు ఫోజులివ్వటం తెలిసిందే. ఈ కార్యక్రమం చంద్రబాబుతో పాటు.. ఆయన కుమారుడు లోకేశ్ పలకలు పట్టుకొని ఫోజులిస్తే.. ప్రచారాలకు దూరంగా ఉండే బాబు సతీమణి భువనేశ్వరి కాగితం మీద.. లోకేశ్ సతీమణి బ్రాహ్మణి.. కొడుకు దేవాన్ష్ ల చేత మాత్రం స్మార్ట్ ఫోన్లను పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చేలా చేశారు. ఈ ప్రచారం రివర్స్ కావటం.. చౌకబారుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దేవాన్ష్.. బ్రాహ్మణి.. భువనేశ్వరిలతో పోలిస్తే.. బాబు.. లోకేశ్ ల ప్రచారం మరీ చౌకబారుగా తేడాగా ఉందన్న విమర్శలు రావటం.. పలువురి సూచనలతో మేల్కొన్న బాబు బ్యాచ్.. మీడియా ఆఫీసులకు ఫోన్లు చేసి మరీ ఆ ఫోటోలు పబ్లిష్ కాకుండా చూశారు.
కానీ.. అప్పటికే  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ఫోటోల మీద వ్యంగ్య విమర్శలు.. జోకులు భారీగా సాగాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలోని ప్రభుత్వ.. ప్రైవేటు పాఠశాలలకు చెందిన 75 లక్షల మంది విద్యార్థులు.. టీచర్లు ఒక్కొక్కరు రూ.10 చొప్పున ఏపీ రాజధాని అమరావతికి విరాళం ఇవ్వాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేయటం తెలిసిందే. ఈ మొత్తం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలం రూ.7 లేదంటే 8 కోట్లు మాత్రమే. కానీ.. దీని వల్ల వచ్చిన విమర్శల తీవ్రత అందుకు వందల రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

చివరకు.. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించటం.. ఈ వసూళ్ల మీద స్టే విధించటం జరిగిపోయాయి. ఇలాంటి చిత్రమైన ఐడియాలు ఇచ్చే బ్యాచ్ ను ఏపీ ముఖ్యమంత్రి దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావోద్వేగానికి రగల్చటానికి ఎన్నో మార్గాలున్నా.. అందుకు భిన్నంగా చిత్రమైన విషయాల్ని తెరపైకి తీసుకొచ్చి.. లేనిపోని చికాకుల్ని నెత్తిన వేసుకుంటున్న బాబు వైఖరిని పలువురు తప్పు పడుతున్నారు. ఆయన్ను తప్పు దారి పట్టిస్తున్న వారి విషయంలో కాస్తంగా జాగరూకతో వ్యవహరించి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News