టీడీపీకి 'స్థానికం' భ‌యం ప‌ట్టుకుందా?

Update: 2018-01-13 10:25 GMT
ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైపోయింది. గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందుగానే జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా, టీడీపీ విప‌క్షంలో ఉంటే... అప్పుడ‌ప్పుడే పురుడుపోసుకున్న వైసీపీ స‌త్తా చాటింద‌నే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా... ఏపీలోని మెజారిటీ జిల్లాల్లో వైసీపీ త‌నదైన శైలిలో స‌త్తా చాటితే... టీడీపీ కూడా మెరుగైన ఫ‌లితాల‌నే సాధించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ... ఇటు టీడీపీతో పాటు అటు వైసీపీ మెజారిటీ సాధించి కాంగ్రెస్ ప‌ని అయిపోయింద‌నే చెప్పేశాయి. విప‌క్షంలో ఉన్నా టీడీపీ మెరుగైన ఫ‌లితాల‌ను సాధించ‌డానికి చాలానే కార‌ణాలున్నాయి. గ్రామాల్లో ప‌టిష్ట‌మైన నిర్మాణ‌మే టీడీపీకి క‌లిసి వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే అప్పుడ‌ప్పుడు తెరంగేట్రం చేసిన వైసీపీకి... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ్ఞాప‌కాలు - పార్టీ ఫిరాయింపుల‌కు వ్య‌తిరేకంగా జ‌గ‌న్ త‌న పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించిన తీరు క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పాలి. ఇదంతా గ‌త‌మే అనుకున్నా... ఇప్పుడు మ‌ళ్లీ స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి... ప్ర‌స్తావించుకోక త‌ప్ప‌దు.

అయితే గ‌తాన్ని పక్క‌న‌బెడితే... ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగితే... ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంద‌న్న చ‌ర్చ మొద‌లైపోయింది. ప‌ల్లె సీమ‌ల్లో ఇంకా ఈ చ‌ర్చ జోరందుకోకున్నా... రాజ‌కీయ పార్టీల్లో మాత్రం దీనిపై ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ న‌డుస్తోంది. గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందుగా జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ స‌త్తా చాటినా... ఆ త‌ర్వాత చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కొన‌సాగిన పార్టీ ఫిరాయింపులు... వైసీపీని పెద్ద దెబ్బే కొట్టాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌డ‌చిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆ పార్టీ గెలుచుకున్న కీల‌క స్థానాలు కూడా ఇప్పుడు టీడీపీ .. జాబితాలోకి చేరిపోయాయి. ఫ‌లితంగా ఇప్పుడు మెజారిటీ స్థానాలు టీడీపీ చేతిలోనే ఉన్నాయి. మ‌రి ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. అధికారంలో ఆ పార్టీనే ఉంది కాబ‌ట్టి... ఫ‌లితాలు కూడా దాదాపుగా ఆ పార్టీకే అనుకూలంగా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు మాత్రం టీడీపీ సాహ‌సించ‌డం లేదు. ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌ని, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం త‌న సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేసినా... ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంలో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు మాత్రం మీన‌మేషాలు లెక్కిస్తున్నారు.

ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ఫ‌లితాలు ఎదుర‌వుతాయ‌న్న భ‌యంతోనే చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల‌పై నాన్చుడు ధోర‌ణి అవ‌లంబిస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా అధికారంలో ఉన్న ఆ పార్టీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు ఎందుకు వెనుకాడుతోంద‌న్న విష‌యంలోకి వెళితే... సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందుగా జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో ఒక‌వేళ వైసీపీకి ఆధిక్యం ద‌క్కితే... సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కొంప కొల్లేర‌వుతుంద‌న్న‌దే ఆ పార్టీ భావ‌న‌గా ఉన్న‌ట్లు విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీకి బ‌లం ఉన్న‌ట్లు, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే... మెజారిటీ స్థానాల‌ను వైసీపీనే కైవసం చేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌టం కూడా చంద్ర‌బాబు వెనుకంజ‌కు కార‌ణంగా తెలుస్తోంది. అయితే త్వ‌ర‌లోనే కాల ప‌రిమితి ముగియ‌నున్న స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయో, లేదంటే ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబు స‌ద‌రు ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తారో చూడాలి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కే ఈ మాత్రం భ‌య‌ప‌డుతున్న చంద్ర‌బాబు... ఇక జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో ఏమాత్రం చ‌క్రం తిప్పుతారో చూడాలి.

Tags:    

Similar News