మంత్రులు 18 గంట‌లు ప‌నిచేయాల్సిందే

Update: 2016-07-09 06:19 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రో మారు మంత్రుల‌పై మండిప‌డ్డారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా ప్రారంభానికి ముందు చంద్రబాబు మాట్లాడుతూ మంత్రుల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా రోజుకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డాల‌ని సూచించారు. తానొకడ్ని కష్టపడి నంతమాత్రాన నూరుశాతం ఫలితాల సాధన సాధ్యం కాదన్నారు. తనతో పాటు మంత్రివర్గ సహచరులంతా తమ తమ స్థాయిల్లో కష్టపడితేనే లక్ష్యాన్ని సాధించగలుగుతామని పేర్కొన్నారు.

సగానికిపైగా మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.  వివిధ మార్గాల్లో మంత్రుల పనితీరుపై తాను సేకరించిన వివరాలు తనకే ఆశ్చర్యం గొలుపుతున్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ''నేను రోజూ 18గంటలకు పైగా కష్ట పడుతున్నాను.. భార్యా బిడ్డల్ని వ‌దిలి దేశాలు పట్టుకు తిరుగుతున్నాను. వీలున్న ప్రతి చోటికి వెళ్ళి రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిగా ప్రాధేయపడుతున్నాను. రాష్ట్రంలోని వనరులు - ఇతర అవకాశాల్ని వివరించి పెట్టుబడులు పెట్టండంటూ పారిశ్రామిక వేత్తల చుట్టూ తిరుగుతున్నాను.. కనీసం మనవడ్ని చూసేందుక్కూడా సమయాన్ని కేటాయించలేకపోతున్నాను.. ఇలా స్పష్టమైన లక్ష్యంతో దృడచిత్తంతో ముందుకు సాగితే తప్ప ప్రస్తుతమున్న పరిస్థితి నుంచి రాష్ట్రం గట్టెక్కదు. ప్రజలనేక ఆశల్తో మనకు ఓట్లేశారు. వారి ఆశల్ని.. ఆశయాల్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలుగుదేశం అధికారంలో కొస్తేనే ఆంధ్రప్రదేశ్‌ తిరిగి పూర్వవైభవం సాధిస్తుందని వారంతా నమ్మారు.. వారి నమ్మకాన్ని మనం ఏ మేరకు నిలబెట్టుకుంటున్నది ఎవరికి వారు మనస్సాక్షితో సమీక్షించుకోండి'' అంటూ బాబు పేర్కొన్నట్లు సమాచారం.

''నేనొక్కడ్ని కష్టపడితే చాలదు. అదే స్థాయిలో మీరంతా కష్టపడాలి. మీకిచ్చిన లక్ష్యాల్ని పూర్తి చేయాలి. ఇందుకోసం అహర్నిశలు ప్రణాళికాబద్దంగా పని చేయాలి. ఇప్పుడు దేశమే కాదు… ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోంది. విభజనతో అనేక ఇబ్బందులకు గురైన ఆంధ్రప్రదేశ్‌ తిరిగి ఆర్థికంగా ఎలా గట్టెక్కుతుందో చూసేందుకు ప్రపంచం ఉత్సుకత ప్రదర్శిస్తోంది. జాతీయ నాయకులేకాదు.. అంతర్జాతీయ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని మార్గదర్శకంగా తీసుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ స్థాయిలో మనం పనిచేయాలంటూ మంత్రులకు సూచించారు. ఇటు ఓట్లేసిన ప్రజల్ని సంతృప్తి పర్చాలి.. అటు అంతర్జాతీయ సమాజం మనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఈ రెండూ సాధించాలంటే మీలో ప్రతిఒక్కరు ఓ చంద్రబాబు కావాల్సిందే. విధిగా 18గంటలు పనిచేయాల్సిందే. ప్రతి రోజు మీ పనితీరును బేరీజు వేసుకోండి'' అంటూ బాబు సూచించారు.

మంత్రుల్లో కొందరు సొంత జిల్లాలకే పరిమితమవుతున్నారని, శాఖాపరమైన సమీక్షలు నిర్వహించడంలేదని బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఆయా శాఖలకిస్తున్న లక్ష్యాల సాధనపై దృష్టిపెట్టడంలేదని, మరికొందరు అధికారులపైనే బారం మోపుతున్నారని త‌ప్పుప‌ట్టారు. ఇలా పనిబద్దకాన్ని ప్రదర్శిస్తే సహించేదిలేదంటూ ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కొందరికి అన్యాపదేశంగా సంకేతాలిచ్చానని పనితీరు మార్చుకోని పక్షంలో సొంతంగా వైదొలగండని బాబు సూచించారు. ప్రజల ఆకాంక్షల్ని భగ్నం చేస్తే మాత్రం సహించేది లేదంటూ స్పష్టం చేశారు. కొందరు మంత్రులు నిరుత్సాహంగా ఉంటే మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇతర శాఖల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. శాఖల వారీగా నూరు శాతం లక్ష్యాల్ని సాధించి తీరాల్సిందేన‌ని లేకుంటే చర్యలు తప్పవని కూడా బాబు హెచ్చరించినట్లు సమాచారం.
Tags:    

Similar News