బాబు వార్నింగ్‌:'ఆంధ్రుల‌తో పెట్టుకోవ‌ద్దు మోడీ'

Update: 2018-04-06 06:53 GMT
మంట పుట్టించే మాట‌ల్ని మొద‌లెట్టేశారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. మైలేజీ మోజులో ప‌డ్డ బాబుకు మొన్న‌టి వ‌ర‌కూ న‌డిచిన మైత్రి గుర్తుకు రావ‌టం లేదు. మోడీతో చెట్టాప‌ట్టాలేసుకున్న బాబుకు.. జ‌గ‌న్ రూపంలో అనుకోని స‌మ‌స్య ఎదురుకావ‌టం.. ప్ర‌జ‌ల్లో ఉన్న హోదాపై మొద‌ట్నించి పోరాడుతున్న జ‌గ‌న్ కంటే మిన్నగా ముందుకెళ్లట‌మే ల‌క్ష్యంగా బాబుకు మారిన నేప‌థ్యంలో.. మోడీ అండ్ కోతో బాబు క‌టీఫ్ చెప్ప‌టం తెలిసిందే.

ఎన్నిక‌ల‌కు ఏడాది మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో.. హోదా సెగ‌ను ఎగ‌దోసి సెంటిమెంట్ సెంట్ తో ఈసారి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌న్న ల‌క్ష్యంతో ముందుకెళుతున్నారు బాబు. ఇందులో భాగంగా పాల‌న‌ను వ‌దిలేసి.. మోడీ మీద వార్ ప్ర‌క‌టించి.. ఇప్పుడ‌దే ప‌నిలో బిజీబిజీగా ఉంటున్నారు.

నిన్న‌టి వ‌ర‌కూ ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న‌.. ఏం చేశారో తెలిసిందే. త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌త్యేక హోదా ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేయ‌టంలో విఫ‌ల‌మైన చంద్ర‌బాబు.. రాష్ట్రానికి వ‌చ్చినంత‌నే శుక్ర‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కే సైకిల్‌.. మోటార్ సైకిల్ యాత్ర‌ల పేరుతో హ‌డావుడి షురూ చేశారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో వెంక‌ట‌పాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్ర‌హం నుంచి అసెంబ్లీ వ‌ర‌కూ సైకిల్ యాత్ర‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఒక మ‌హిళ రాజ‌ధాని నిర్మాణం కోసం రూ.5ల‌క్ష‌ల విరాళాన్ని చెక్కు రూపంలో బాబుకు అంద‌జేశారు. ఆమెను అభినందించిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి నిర్మాణంలో ప్ర‌జ‌లంతా భాగ‌స్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు.

ఏపీని బ‌ల‌హీనం చేసేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. అదెప్ప‌టికీ సాధ్యం కాద‌న్నారు. తెలుగువారితో పెట్టుకుంటే ఎవ‌రికైనా ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని.. నాడు ఎన్టీఆర్ ను గ‌ద్దె దించాల‌ని ప్ర‌య‌త్నించిన ఇందిరాగాంధీ ప‌రిస్థితి ఏమైంది అంద‌రికి తెలుస‌న్నారు. విభ‌జ‌నతో ఏపీకి తీవ్ర న‌ష్టం క‌లిగించిన కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రంలో తుడుచుకు పెట్టుకు పోయింద‌న్న బాబు.. మోడీకి నేరుగా వార్నింగ్ ఇచ్చేశారు. "ఆందుకే మోడీకి చెబుతున్నా.. ఆంధ్రుల‌తో పెట్టుకున్నా మీకూ అలాంటి ప‌రిస్థితే వ‌స్తుంది" అంటూ హెచ్చ‌రిక చేశారు. ఈరోజు మోడీని ఇన్ని మాట‌లు అంటున్న చంద్ర‌బాబు గ‌డిచిన నాలుగేళ్లుగా హోదా మీద అన్ని పిల్లిమొగ్గ‌లు వేశారెందుకు? మ‌రి.. అందుకు ఏపీ ప్ర‌జ‌లు బాబుకు మ‌రెలాంటి శిక్ష విధిస్తారో..?


Tags:    

Similar News