కాకినాడ కోసం ఇంత పెద్ద స్కెచ్ ఏంది బాబు?

Update: 2017-08-25 16:27 GMT
ఏపీలో అధికార‌ తెలుగుదేశం పార్టీ వ‌రుస ఎన్నిక‌ల బిజీలో ప‌డింది. నంద్యాల ఉపఎన్నిక ముగిసిపోవడంతో అధికార పార్టీ కాకినాడ కార్పొరేషన్‌ పై దృష్టిపెట్టింది. నంద్యాల ఉప ఎన్నిక‌లో గెలుపుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్న నేప‌థ్యంలో కాకినాడ కార్పొరేష‌న్‌ పై తెలుగుదేశం అధిష్టానం సీరియ‌స్‌ గా దృష్టి సారించార‌ని తెలుస్తోంది. అయితే ఈ ఫోకస్ కొంచెం అతి అయింద‌ని ప‌లువురు అంటున్నారు. ఎందుకు అంటే టీడీపీ సీనియ‌ర్లు మోహ‌రించిన తీరే. ఏకంగా 11మంది మంత్రులు కాకినాడలో తెలుగుదేశం తరపున ప్రచారంలో నిమగ్నమవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అంటున్నారు.

రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి - హోమ్‌ మంత్రి నిమ్మ‌కాయ‌ల‌ చినరాజప్ప ఇప్ప‌టికే కాకినాడ కార్పొరేష‌న్‌ ఎన్నికల భారాన్ని భుజస్కందాలపై వేసుకున్నారు. అయితే ఆయ‌నపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మో లేక మ‌రేదైనా కార‌ణ‌మో తెలియ‌దు కానీ మ‌రింత మంది మంత్రుల‌ను టీడీపీ అధిష్టానం  రంగంలోకి దింపింది. సీనియ‌ర్ మంత్రి యనమల రామకృష్ణుడు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలకు ఇన్‌ చార్జిగా నియమితులైన ప్రత్తిపాటి పుల్లారావు కూడా నగరంలోనే ప్రచారం చేస్తున్నారు. వీరికి తోడు మ‌రింత‌మంది మంత్రులు గురువారం - శుక్ర‌వారాల్లో కాకినాడ‌లో ప‌ర్య‌టించారు. మంత్రి శిద్దా రాఘవరావు - నగరంలో వైశ్యులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే 33వ డివిజన్‌ లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క‌లిసివ‌చ్చారు.27వ డివిజన్‌ లో తెలుగుదేశం అభ్యర్ధి మంగరత్నంకు మద్దతుగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రచారం నిర్వహించారు. 24వ డివిజన్‌ లో డోకుబుర్ర భద్రంకు మద్దతుగా మంత్రులు ఆనందబాబు - కెఎస్‌ జవహర్‌ లు ప్రచారం చేశారు.

ఇక మంత్రులే కాకుండా ఎంపీలు - ఎమ్మెల్యేలు - పార్టీ నేత‌లు - కార్పొరేష‌న్ చైర్మ‌న్ల‌ను సైతం టీడీపీ రంగంలోకి దింపింది. ఎంపీ అవంతి శ్రీనివాస్‌ - మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రేచర్లపేటలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 41వ డివిజన్‌లో ఎంపీ తోట సీతారామలక్ష్మి - ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి - శ్రీరామ్‌ తాతయ్య తదితరులు ఎన్నికల ప్రచారం చేశారు.  పార్టీ కార్యాలయంలో మోచి కులస్తుల్తో జూపూడి ప్రభాకరరావు సమావేశం జరిపారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాల్సిందిగా కోరారు. 38వ డివిజన్‌ లో హోంమంత్రి రాజప్పతో కలసి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రచారం చేశారు. కాగా, కార్పొరేష‌న్ ఎన్నిక కోసం అధికార తెలుగుదేశం పార్టీ ఇంత శ్ర‌ద్ధ పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News