చంద్రబాబుకు ఈ అగ్నిప్రవేశం అవసరమా...?

Update: 2015-09-28 07:46 GMT
ఏపీ సీఎం చంద్రబాబుకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ కొన్ని విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారాయన. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ప్రశంసలు అందుకున్న ఆయన అందులో లోపాలతో విమర్శలూ ఎదుర్కొన్నారు. అయితే... పథకమంటూ ఉండడంతో లోపాలు సరిదిద్దుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. అయితే... పట్టిసీమపై వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో రైతులకు వాస్తవాలు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రైతులను పట్టిసీమకు తెచ్చి చూపించాలన్న ఆలోచన చేసింది. అందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం ఏకంగా ఆరున్నర కోట్లు ఖర్చు చేస్తోంది. దీంతో ఇదంతా అవసరమా అన్న వాదన వినిపిస్తోంది. రైతుల వద్ద నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చింది.. పట్టిసీమ పూర్తిస్థాయిలో ఫలితమందిస్తే వాళ్లే అర్తం చేసుకుంటారు కదా అన్న వాదన వినిపిస్తోంది.

పట్టిసీమ వద్దకు రైతులను తీసుకెళ్లి చూపించే ప్రోగ్రాంకు ప్రభుత్వం అక్టోబరు 2 నుంచి శ్రీకారం చుడుతోంది. దీనికి జిల్లాకు రూ.50 లక్షలు వంతున రూ.6.50 కోట్లు విడుదల చేసింది. డిసెంబర్‌ మూడు వరకు రెండు నెలల పాటు ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు జీవో 99ని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు ప్రతి పంచాయతీ నుంచి ఒక బస్సును ఏర్పాటు చేసి ఆ ప్రాంత రైతులను ఉచితంగా పట్టిసీమ ప్రాంతానికి తీసు కెళతారు. పట్టిసీమపై ప్రతిపక్షాల విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రైతులకు ఆ ప్రాజె క్టును చూపించి వారిలో అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం గ్రామ స్థాయిలో సర్పంచి ఆధ్వర్యంలో గ్రామకమిటీ, మండలస్థాయిలో ఎంపిడిఓ అధ్యక్షతన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం కార్యక్రమం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జరగనుంది.

అయితే.... రెండు నెలల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో నిధులు వృథా, అధికారులకు అదనపు పని తప్ప ప్రత్యేకమైన లాభమేముంటుందన్నది చంద్రబాబుకే తెలియాలి. ప్రతిపక్షాలు అన్న తరువాత విమర్శిస్తాయని... తాను చేసిన పనులు ఫలితమిస్తే ప్రజలే అర్థం చేసుకుంటారని చంద్రబాబు అర్థం చేసుకుంటే ఇలాంటి శీల నిరూపణ కార్యక్రమాల అవసరమే ఉండదు.
Tags:    

Similar News