చూస్తుంటే బాబు ఎన్నిక‌ల‌కు వెళ్లేలాగున్నాడే

Update: 2016-06-22 12:04 GMT
ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నిక‌ల‌కు ఎదుర్కునేందుకు సిద్ధ‌ప‌డ్డారా?  దాదాపు ఏడాదిగా పెండింగ్‌ లో ఉన్న స్థానిక సంస్థ‌ల పోరుకు త్వ‌ర‌లో ఏపీలో ప్ర‌క‌ట‌న రానుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. సీఎం చ‌ంద్ర‌బాబు తాజాగా చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని తెలుస్తోంది

ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పురపాలక సంఘాలు - నగర పాలక సంస్థలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతినెలా ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా పురపాలక సంఘాలలో పనితీరు మెరుగు పరచుకోవాలని కోరారు. రాష్ట్రంలో అన్ని పురపాలక సంఘాలలో 80 శాతం ప్రజల మద్దతు ఎన్నికల్లో తమకే లభించిందని, ప్రజల నుంచి అంతే మొత్తంలో సంతృప్తి ఫలితాలనూ రాబట్టాల్సి ఉందన్నారు. పట్టణాలు - నగరాల్లో నివసించే వారి అంచనాలు - ఆశలు చాలా చిన్నవిగానే ఉంటాయని - పారిశుధ్యం మెరుగ్గా వుండి - నిరంతరం మంచినీటిని సరఫరాచేస్తే ప్రజల్లో సంతోషం శాతం పెరుగుతుందని బాబు తెలిపారు. ప్రతి పట్టణంలోనూ వీధులు సౌర విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతున్నాయన్నారు. దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు - ఫైబర్‌ ఆప్టిక్‌ గ్రిడ్‌ కింద ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికీ టాయిలెట్‌ - అన్ని ముఖ్యకూడళ్లలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ - రెండు - నాలుగువరసల రహదారులు - ఇతర మౌలిక సదుపాయాలతో పట్టణ ప్రాంతాల ప్రజల విశ్వాసాన్ని పెంచుకున్నామని తెలిపారు. పౌర సేవలన్నీ ఆన్‌ లైన్‌ చేయడం ద్వారా అవినీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా చేశామని సిఎం గుర్తుచేశారు. ఎస్‌ సి - ఎస్‌ టి - బిసి మైనారిటీ - కాపు - బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు కల్పిస్తున్న సదుపాయాలు - సేవలలో మరింత నాణ్యత కనబర్చేలా అధికారులు - ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

విశాఖపట్నం - తిరుపతి - కాకినాడ తదితర నగర పాలక సంస్థలు - వివిధ మున్సిపాలిటీలకు చాలాకాలంగా ఎన్నికలు జరగలేదు. వీటన్నింటికీ జూలై - ఆగస్టు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఉన్న విధానాన్ని తొల‌గించేందుకు చంద్ర‌బాబు రెడీ అయ్యారు. గ‌త పాల‌క‌వ‌ర్గం వ‌ర‌కు కార్పొరేషన్లకు - మున్సిపాలటీలకు పరోక్ష పద్ధతిన ఎన్నికలు జరిగాయి. దీనివలన అన్ని రాజకీయ పార్టీలకు సమస్యలు ఎదురవుతున్నాయని అందుకే ప్ర‌త్య‌క్ష ప‌ద్దతిన నగరపాలక సంస్థ మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌య్యార‌ని అంటున్నారు.
Tags:    

Similar News