బాబు ఇలాంటి స్పీచ్ కూడా ఇస్తారు తెలుసా?

Update: 2017-02-07 05:20 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్ర‌సంగం అంటే ప్ర‌సంగం లాగే ఉంటుంది త‌ప్పించి అందులో చ‌లోక్తులు, సంద‌ర్భోచిత ప‌దాలు, ఆస‌క్తిక‌ర‌మైన సామెత‌లు అస్స‌లేమాత్రం ఉండ‌వ‌నేది జ‌ర్న‌లిస్టుల్లో - రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉన్న మాట‌. ఇలా రొటీన్ స్పీచ్‌ తో సుదీర్ఘంగా మాట్లాడి బోర్ కొట్టించే బాబు మారుతున్న‌ట్లుగా ఉంద‌ని అంటున్నారు. గుంటూరులో నూతనంగా నిర్మించిన నగరంపాలెం - పాతగుంటూరు ఆదర్శ పోలీసుస్టేషన్ల ప్రారంభం అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్వేగంగా మాట్లాడ‌ట‌మే కాకుండా అప్పుడప్పుడు ఛలోక్తులు, వ్యంగ్యోక్తులతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఎప్పటిలాగాఏ విపక్షనేత జగన్‌ పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించార‌నుకోండి. అదే స‌మ‌యంలో ఎప్పుడూ చెప్పుకొచ్చే రాష్ట్ర విభ‌జ‌న అంశాన్ని కూడా వ‌దిలిపెట్టలేదు. ఈ పోలీస్ స్టేష‌న్ విద్యార్థుల భ‌విష్య‌త్ కోస‌మే నిర్మించామ‌ని సెటైర్ వేసిన బాబు..వారి భ‌విష్య‌త్‌ కు అడ్డంకిగా మారే శ‌క్తుల‌ను అణిచివేసేందుకు ఆద‌ర్శ పోలీస్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చామ‌ని చ‌మ‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మ‌రిన్ని అంశాల‌ను చంద్ర‌బాబు వివ‌రిస్తూ...రాష్ట్ర విభజన హేతబద్ధంగా జరుగలేదని 16 వేలకోట్లు లోటుబడ్జెట్‌ తో రాష్ట్రం ఏర్పడినప్పటికీ, సమర్ధవంతంగా పనిచేస్తూ సంక్షేమ పథకాలకు పెద్దపీటవేసి అభివృద్ధికి శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. జనవరి 26 రిపబ్లిక్‌ డే సందర్భంగా విపక్షనేత వైఎస్ జ‌గ‌న్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని సీఎం తప్పుపట్టారు. జల్లికట్టును ప్రత్యేక హోదాకు ముడిపెడుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం ఏమిట‌న్నారు. దేశవ్యాప్తంగా రిపబ్లిక్‌ డే సందర్భంగా ఏడుకలు నిర్వహిస్తుంటే విపక్షనేత నిరసనకు పిలుపునివ్వడం శోచనీయమన్నారు. అవాంఛనీయ సంఘటనలు చేయాలని ఉగ్రవాదులు ఆరోజున దాడులు చేసే అవకాశాలున్నాయని నిఘావర్గాలు హెచ్చరించాయన్నారు. దేశాన్ని అస్థిరత్వం చేయాలనుకుంటే అలాంటి సమయంలో గొడవలు చేస్తే ఎవరికీ లాభలో ప్రజలే ఆలోచించాలన్నారు. ఈ ఘటనను జరుగకుండా పోలీసులు సమర్థవంతంగా నిలువరించారని చంద్రబాబు ప్రశంసించారు. సున్నితమైన సమస్యలను జఠిలం చేసి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇటీవల విశాఖ ఎయిర్‌ పోర్టులో కొందరు నేతలు ఏమిమాట్లాడారో ప్రజలంతా చూశారని జగన్‌ ను ఉద్దేశించి సీఎం విమర్శలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కొంతమంది స్వార్థపరులు పనిగట్టుకుని విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ప్రత్యేక హోదాకు, ప్యాకేజీల వ్యత్యాసాలు చెప్పాలని సూచించినా నోరు మెదపడంలేదని, హోదాలోని అన్ని అంశాలు ప్యాకేజీలో పొందుపరిచార‌ని చంద్ర‌బాబు అన్నారు.

హోదాకు, ప్యాకేజీకి వ్యత్యాసం లేదని చెప్పిన చంద్ర‌బాబు ఈ విష‌యం తెలియ‌ని వారు ఉద్య‌మిస్తున్నారంటూ పంచ్ వేశారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం కేంద్రంతో పోరాటం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ వలన రాష్ట్రానికి ఉపయోగం ఉన్నందున ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తిచేసి నదుల అనుసంధానం చేపడితే రాష్ట్రంలో తాగునీరు - సాగునీటికి కొరత ఉండదన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం పూర్తి సహాయసహకారం అందిస్తోందన్నారు. రాష్ట్రప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఏరంగంలో అయినా నాయకత్వం బాగుంటేనే ఆ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. అలాంటి నాయకత్వాన్ని అన్ని రంగాల్లో తీసుకురావడానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే పోలీసుశాఖలో ఆధునీకరణకు శ్రీకారం చుట్టడం జరిగిందని  తెలిపారు. తానెవరికీ భయపడనని, భయపడబోనని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి భావితరాల ప్రయోజనాల కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. సున్నితమైన సమస్యలను జఠిలం చేసి, రాజకీయ స్వార్థంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నించడం విచారకరమన్నారు. రౌడీయిజం, ధర్నాలు, పోలీసుస్టేషన్లు తగులపెట్టడం వంటి కార్యక్రమాలు ఇకనుంచి సాగవన్నారు. ప్రజాసమస్యలపై నిరసన వ్యక్తం చేసే అధికారం అందరికీ ఉంటుందన్నారు. అయితే వారు చేసే విధానం అందుకు అనుగుణంగా ఉండాలన్నారు. తమ కార్యకలాపాల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టేవిధంగా ఉండకూడదన్నారు. హోదా పేరుతో విపక్షాలు చేసే రాద్దాంతం పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కులాలపేరుతో చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమాజంలో వారి వృత్తులను బట్టి కులాలు వచ్చాయన్నారు. సమాజంలో రెండే కులాలనీ, డబ్బున్నవారికులం, పేదకులం అన్నారు. కొన్నికులాల్లో పేదరికం ఉన్నమాట వాస్తవమేనన్నారు. కాపుల్లో పేద వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పినా విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. తునిలో రైలు తగులబెట్టడం, పోలీసు వాహనాలను విధ్వంసం చేయడం వంటి ఘటనలకు పూనుకోవడం శోచనీయమని ముద్రగడ పద్మనాభంను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News