బాబు మారారా? కేసీఆర్ మార్చారా?

Update: 2016-05-30 09:44 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైల్ మిగిలిన నాయకులకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయనలో ఎమోషన్స్ ను ఇంటి దగ్గర వదిలి పెడతారన్నట్లుగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా సరదాగా ఉండే చంద్రబాబు.. బయట మాత్రం పని.. పని అన్నట్లుగా సీరియస్ గా ఉంటారు. పదేళ్లు ప్రతిపక్ష నేత ఉన్న సమయంలో ఆయన మీద వచ్చిన విమర్శలతో ఆయన నవ్వటం మొదలుపెట్టారన్న విమర్శ కూడా ఉంది. అలాంటి చంద్రబాబులో ఈ మధ్య చాలానే మార్పులు వస్తున్నాయి.

తన మిత్రుల కోసమో.. తెలిసిన వారి కోసమో తన కాన్వాయ్ ను చంద్రబాబు ఆపిన దాఖలాలు పెద్దగా కనిపించవు. దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టైల్ పూర్తి భిన్నం. ఆయన మాటల్లో ఎలాంటి భావోద్వేగాలు పలికిస్తారో.. విడిగానూ అలాంటి భావోద్వేగ ఘటనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాను రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో తెలిసినోళ్లు ఎవరైనా కనిపిస్తే చటుక్కున వాహనాల్ని ఆపేసి వారితో మాట్లాడటమే కాదు.. పాత స్నేహితులు ఎవరైనా కలిసినప్పుడు.. ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానిస్తారు కూడా.

ఇలాంటి అంశాలు తరచూ మీడియాలో రావటం ఏపీ ముఖ్యమంత్రి మీద ప్రభావం చూపినట్లుగా ఉంది తాజా పరిణామాలు చూస్తే. మొన్నటికి మొన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్తను రోడ్డు మీద చూసిన చంద్రబాబు.. తన కాన్వాయ్ ను నిలిపి పలుకరించారు. ఈ ఘటనను మర్చిపోక ముందే.. తన సొంతూరు నారావారి పల్లె నుంచి మహానాడుకు హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడు గిరిధర్ రెడ్డిని చూసి తన కాన్వాయ్ ను నిలిపివేసిన చంద్రబాబు ఆయన్ను పలుకరించి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చూస్తుంటే.. కేసీఆర్ ప్రభావం చంద్రబాబు మీద బాగానే పని చేస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News