కేవీపీకి చంద్రబాబు బ్యాకింగ్

Update: 2016-07-16 09:49 GMT
వినేందుకు విచిత్రంగా అనిపించినా.. ఏపీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సపోర్ట్ చేయనున్నారు. కేవీపీ పొడగిట్టని చంద్రబాబు.. అదే రీతిలో బాబు అంటేనే ఆమడ దూరం నుంచే మండిపడే కేవీపీ మధ్య రిలేషన్ ఏ విధంగా సెట్ అయ్యిందన్న సందేహం అక్కర్లేదు. ఇదంతా కూడా ఇష్యూ ప్రాతిపదికగానే చెప్పాలి. దివంగత మహానేత వైఎస్ ఆత్మగా చెప్పే కేవీపీ రామచంద్రరావు ఆ మధ్యన ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టటం తెలిసిందే.

ఈ బిల్లుపై చర్చ జరిగి.. ఓటింగ్ జరిగిన పక్షంలో దీనికి అనుకూలంగా ఓటువేయాలన్న నిర్ణయాన్ని ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్నారు. విజయవాడలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ డిసైడ్ చేసింది. ఈ భేటీలో తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. అంతేకాదు..ఏపీ ప్రయోజనాలకు సంబంధించి పార్టీలతో పని లేకుండా ఎవరు మాట్లాడినా..వారికి పూర్తిస్థాయి మద్ధతు ఇవ్వాలని చెప్పటం గమనార్హం. ఏపీ విభజనకు సంబంధించి భావోద్వేగపరమైన స్టాండ్ విషయంలో ఏ మాత్రం తగ్గకూడదన్న ఆలోచనే తాజా నిర్ణయంగా చెబుతున్నారు.

గతంతో పోలిస్తే.. ఈ మధ్యన ప్రతి సమావేశంలో విభజన కారణంగా ఏపీకి ఎదురైన ఇబ్బందిని ప్రస్తావించటమే కాదు.. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని తన కంటే మరెవరూ మాట్లాడలేదన్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే పార్టీ ఏదైనా.. నేతలు ఎవరైనా సరే..ఏపీ ప్రయోజనం అన్నది ఉంటే చాలు.. వేదిక ఏదైనా.. తమ్ముళ్లు వారితో కలిసి చెలరేగిపోవచ్చన్నట్లుగా బాబు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే..ఏపీకి సంబంధించి భావోద్వేగ రాజకీయాలకు తానే కెప్టెన్ అన్న విషయాన్ని చంద్రబాబు తాజా వైఖరితో స్పష్టం చేసినట్లుగా చెప్పొచ్చు.
Tags:    

Similar News