మంత్రుల‌కు చంద్ర‌బాబు క్లాస్ ఇదే..!

Update: 2015-12-22 11:30 GMT
ముఖ్య‌మంత్రి త‌ర్వాత ప‌రిపాల‌నా బాధ్య‌త‌లు చూసేదంతా మంత్రులే. నాయ‌కుడొక్క‌డే ప‌నిచేస్తుంటే స‌రిపోదు.. ఆయ‌న బృందంలోని స‌భ్యులంతా ఆయ‌న‌లాగే పనిచేస్తుండాలి.. అప్పుడే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంది. ఇది ఏపీ మంత్రుల‌కూ వ‌ర్తిస్తుంది. చంద్ర‌బాబు అంటే ఆయ‌న‌కున్న ప‌ని రాక్ష‌సుడ‌న్న పేరే ఆయ‌న ఎలా ప‌ని చేస్తారో స్ప‌ష్టం చేస్తుంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నుంచి రాష్ట్రాభివృద్ధికి తన శాయ‌శ‌క్తులా సీఎం చంద్ర‌బాబు కృషిచేస్తుంటే.. మంత్రులు మాత్రం ఆయ‌న్ను అందుకోలేక‌పోతున్నార‌నేది అంద‌రికీ తెలిసిందే. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు కూడా మంత్రుల‌కు వివ‌రించారు. అయినా వారి వ్య‌వ‌హార శైలి మాత్రం మార‌లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిన్న జ‌రిగిన‌ శాస‌న‌స‌భ్య‌ల స‌మావేశంలోనూ ఆయ‌న ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. అయితే ఈసారి మాత్రం మంత్రుల‌కు కొన్ని హెచ్చ‌రిక‌లు జారీచేశారు. ఇదే స‌మ‌యంలో వారికి కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు పెట్టారు.

ఏపీ మంత్రుల పని తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. శాసనసభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులు చొరవతో పనిచేయాల్సిన అవసర‌ముంద‌ని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, చాలా జిల్లాల్లో మంత్రుల‌కు ఎమ్మెల్యేలతో సమస్వయం లేదని ఫిర్యాదులు వస్తున్నాయ‌ని, ఇక‌మీద‌ట అటువంటివి జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టంచేశారు. కొన్ని జిల్లాలలో పార్టీ బలహీనంగా ఉన్నచోట ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలను వ్యతిరేకించవద్దని నేత‌ల‌కు సూచించారు. ఎవరైనా దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కుదరదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మరింత బలోపేతం కావల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.

పార్టీకి నష్టం క‌లిగించేలా వ్యవహరిస్తే ఒకరిద్దరిని వదులుకోవడానికి కూడా తాను సిద్ధ‌మేనని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు విజయవాడలో ఉండాలని కూడా ఆయన సూచించారు. అయితే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న త్వ‌ర‌లో జ‌ర‌గ‌వ‌చ్చ‌ని, ఈనేప‌థ్యంలోనే ఆయ‌న ఇటువంటి హెచ్చ‌ర‌కలు చేసి ఉండ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే కొంద‌రు మంత్రుల‌కు చంద్ర‌బాబు ఎన్నిసార్లు చెప్పినా ప‌ని తీరు మార్చుకోక‌పోవ‌డంతో వారిపై వేటు లేదా శాఖల మార్పు ఖాయంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News