రాహుల్ గాంధీ అలాంటి ప‌ని చేశారా?

Update: 2017-07-10 09:37 GMT
సిక్కిం స‌రిహ‌ద్దుల్లోని డోక్లాం ఇష్యూలో భార‌త్‌.. చైనాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. భార‌త్ భ‌ద్ర‌త‌కు పెను ముప్పు వాటిల్లేలా చైనా చేస్తున్న ప్ర‌య‌త్నాల్ని భార‌త్ వ్యూహాత్మ‌కంగా  నిలువ‌రిస్తోంది. ఈ క్ర‌మంలో  గ‌తంలో ఎప్పుడూ లేనంత ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డోక్లాంలోకి భార‌త్ సైనికులు వెళ్ల‌ట‌మే కాదు.. అక్క‌డి నుంచి వెన‌క్కివెళ్లిపోవాలంటూ చైనా సైనికాధికారులు కోరినా.. నో చెప్పేసి.. అక్క‌డే గుడారాలు వేసుకోవ‌టం లాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా సంచ‌ల‌న అంశం తెర మీద‌కు వ‌చ్చింది. త‌మ రాయ‌బారి లుయొ జ‌వావొహుయ్‌ తో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యార‌ని చైనా ఎంబ‌సీ వెల్ల‌డించ‌టం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న‌వేళ‌.. విప‌క్ష పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌ను చైనా దౌత్య‌వేత్త క‌లుసుకున్నార‌న్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ వార్త‌ను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

చైనా దౌత్య‌వేత్త‌ను రాహుల్ గాంధీ క‌ల‌వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.  ఇదంతా బీజేపీ అనుకూల మీడియా చేసిన కుట్ర‌గా కాంగ్రెస్ పార్టీ స‌మాచార విభాగం బాధ్యుడు ర‌ణ్ దీప్ సుర్జీవాలా ఆరోపించారు. విదేశాంగ‌.. స‌మాచార మంత్రిత్వ శాఖ‌లు ఇచ్చిన స‌మాచారాన్ని బీజేపీ అనుకూల టీవీ ఛానల్స్ ప్ర‌సారం చేసిన‌ట్లుగా విమ‌ర్శించారు. ముగ్గురు కేంద్ర‌మంత్రులు చైనా ప‌ర్య‌ట‌న గురించి ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని నిల‌దీసిన ఆయ‌న‌.. జీ20 స‌ద‌స్సు సంద‌ర్భంగా చైనా అధ్య‌క్షుడు.. ప్ర‌ధాని మోడీ ప‌ర‌స్ప‌రం ప్ర‌శంస‌లు కురిపించుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు. మ‌రి.. చైనా దౌత్య‌వేత్త‌తో రాహుల్ భేటీకి సంబంధించి చైనా అధికారిక మీడియా ఎలాంటి స‌మాచారాన్ని బ‌య‌ట‌పెడుతుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది.
Tags:    

Similar News