మొట్టమొదటిసారిగా 2011లో చైనా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ `తియాంగాంగ్-1` అదుపు తప్పి ఏప్రిల్ 1న భూమిని ఢీకొట్టబోతోందన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నం 12.15 నిమిషాలకు అది భూమిని ఢీకొంటుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈయూఏ)తెలిపింది.
స్కూల్ బస్సు సైజులో (8.5టన్నులు) ఉన్న `తియాంగాంగ్-1` అమెరికాలోని చికాగో - టాస్మేనియా - మిచిగాన్ లతో పాటు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో పడవచ్చని అంతా భావించారు. అయితే, మంగళవారం తెల్లవారుఝామున 5.45 నిమిషాలకు(భారత కాలమానం ప్రకారం) దక్షిణ ఫసిఫిక్ లోని మధ్య భాగంలో `తియాంగాంగ్-1` శకలాలు పడిపోయినట్లు చైనా స్పేస్ సెంటర్ అధికారులు వెల్లడించారు. 8 టన్నుల బరువున్న గల ఈ స్పేస్ స్టేషన్ కు సంబంధించిన శకలాలలో అధికభాగం గాలిలో మండిపోయినట్లు వారు తెలిపారు.
తన మొట్టమొదటి స్పేస్ స్టేషన్ `తియాంగాంగ్-1`ను చైనా 2011 సెప్టెంబర్ లో ప్రయోగించింది. 2012 - 2013 లో ఇద్దరు `టైకోనాట్ `లు (చైనా వ్యోమగాములు) `తియాంగాంగ్ -1` పనితీరును పరిశీలించారు. 2013 జూన్ సమయానికి ఆ స్పేస్ స్టేషన్ ప్రధాన లక్ష్యాలు నెరవేరాయి. ఆ తర్వాత 2016 మార్చి నుంచి నియంత్రణ కోల్పోయిన `తియాంగాంగ్-1`భూమివైపు ప్రయాణించడం మొదలైంది. ఆ స్పేస్ స్టేషన్ మాల్ ఫంక్షన్ కు గురైన నేపథ్యలో అది చైనా అధీనంలో కూడా లేదు. అందువల్ల - దానిని సముద్రంలో ల్యాండ్ అయ్యే విధంగా చేసే అవకాశం కూడా లేదు. దీంతో, ఏ ప్రాంతంలో పడుతుందో అన్న అంశంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు అది ఫసిఫిక్ లోని మధ్య భాగంలో పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.