చినాయ్.. మన రాంబో

Update: 2015-09-01 09:31 GMT
హీరో సైన్యంలో పని చేస్తుంటాడు. శత్రు దేశంతో యుద్ధం జరుగుతుంటుంది. హీరో రంగ ప్రవేశం చేస్తాడు. శత్రువుల్ని తుత్తనీయుల్ని చేసేస్తుంటాడు. అనుకోకుండా శత్రువుల ధాటికి అతడి విమానం కుప్పకూలుతుంది. అందులో నుంచి సాహసోపేతంగా.. సురక్షితంగా  ఆకాశం మీద నుంచి నేల మీదకు దిగేస్తాడు. చుట్టూ శత్రు దేశీయులు అతడి వెంట పడుతుంటారు. కానీ.. అతగాడు తెలివిగా వారి నుంచి తప్పించుకుంటూ.. మాతృదేశానికి చేరుకుంటాడు. నరాలు తెగిపోయే ఉత్కంటతో సాగే సినిమా కంచికి వెళితే.. మనం ఇంటికి వెళతాం.

ఇలాంటి కథలతో కూడిన హాలీవుడ్.. బాలీవుడ్ సినిమాలు చాలానే చేసేసి ఉంటాం. కానీ.. రియల్ లైఫ్ లో అలాంటి వాళ్లు ఉంటారా? అన్న ప్రశ్న దగ్గర చాలామంది ఆగిపోతుంటారు. అలాంటివి నిజజీవితంలో తక్కువే. ఒకవేళ ఉన్నా.. వారికి సంబంధించిన వివరాలు బయటకు పెద్దగా రావు. అలాంటిదే తాజా ఉదంతం కూడా.

ఎన్డీటీవీ ఛానల్ పుణ్యమా అని తాజాగా ఒక రియల్ హీరో.. ఇంకో మాటలో చెప్పాలంటే.. ఇండియన్ రాంబో లాంటి ఒక వ్యక్తి ఉదంతాన్ని బయటకు తెచ్చింది. పాక్ తో జరిగిన యుద్ధంలో విరోచితంగా ఆ దేశం మీదకు విమానదాడి చేసేందుకు వెళ్లి.. ప్రమాదవశాత్తు అక్కడ చిక్కుకుపోయి.. చాలా తెలివిగా ఆ దేశ సైనికుల కంట్లో పడకుండా తప్పించుకొని దేశానికి చేరుకున్న సాహసోపేతమైన రియల్ స్టోరీ ఎన్డీటీవీ కారణంగా బయటకు వచ్చింది.

దేశవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తున్న ఈ కథనంలోకి వెళితే.. 1965లో పాక్ తో జరిగిన యుద్ధ సమయంలో ఇరవైఏళ్ల దేరా చినాయ్.. ప్లయ్యింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. ముంబయికి చెందిన ఈ యువ పైలెట్ ఒక పెద్ద బాధ్యతను అప్పజెప్పారు. అదేమంటే.. సరిహద్దుల్లో పాక్ మొహరించిన ఆర్టిలరీ వాహనాల్ని ధ్వంసం చేయటం. అందుకు ఓకే చెప్పిన ఆయన సెప్టెంబర్ 10న విమానం తీసుకొని బయలుదేరాడు. విమానం నిండుగా మందుగుండు సామాగ్రితో బయలుదేరి అతగాడు.. లక్ష్యం దిశగా దూసుకెళ్లాడు.

బాంబులతో నిండిన విమానంతో తన పని మొదలు పెట్టినప్పటికీ.. దురదృష్టవశాత్తు చినాయ్ విమానాన్ని శత్రు సైనికులు పేల్చేశారు. విషయాన్ని గుర్తించిన చినాయ్ ప్యారాచూట్ సాయంతో విమానం నుంచి బయటపడ్డాడు. విమానం నుంచి క్షేమంగా బయటపడ్డ అతడ్ని మట్టుబెట్టేందుకు పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారు. మొత్తంగా వారి నుంచి తప్పించుకున్నాడు. ప్యారాచూట్ సాయంతో ల్యాండ్ అయిన అతగాడ్ని మట్టుబెట్టేందుకు పాక్ దళాలు పరుగులు దీశాయి. వారికి ఏ మాత్రం చిక్కినా తన పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన చినాయ్.. తనప్రాణాన్ని తప్పించుకుంటూ శత్రువులకు దొరక్కుండా పరుగులు పెట్టసాగాడు.

అదృష్టవశాత్తు అతడు పరుగులు పెట్టిన కాసేపటికి ఏపుగా ఎదిగిన చెరుకు పంట కనిపించింది. దాదాపు ఆరడుగులకు పైనే పెరిగిన ఆ తోటలో శత్రవుల కంట పడకుండా జాగ్రత్తగా నక్కిన అతగాడు.. ముందుజాగ్రత్తలో భాగంగా.. తన ఐడెంటిటీ కార్డు.. తనకు సంబంధించిన పత్రాలతో పాటు.. మిగిలిన ముఖ్యమైన పత్రాల్ని అప్పటికప్పుడు ధ్వంసం చేసేశాడు.

అలాంటి టెన్షన్ లోనూ చాలా లాజిక్ గా ఆలోచించిన చినాయ్.. శత్రువులు తనను మట్టుబెట్టేందుకు ఏం చేస్తారని ఆలోచించాడు. భారత సరిహద్దుల్లోకి చేరుకునేందుకు తూర్పు దిశగా వెళ్లే అవకాశం ఉందని పాక్ సైనికులు భావిస్తారు కాబట్టి.. అందుకు భిన్నంగా ఉత్తరం దిశగా పరుగులు పెట్టసాగాడు. అతను అనుకున్నదే నిజం అయ్యింది. శత్రువుల నుంచి తప్పించుకున్నా.. ప్రమాదం నుంచి కాదన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ.. ఒంట్లో తగ్గిపోతున్న ఓపికను తెచ్చుకొని  భారత్ వైపు ప్రయాణం సాగించాడు.

అలా మొదలెట్టిన అతడి పరుగులాంటి నడక చివరకు రాత్రివేళ.. చంద్రుడి సాక్షిగా భారత్ సరిహద్దుల్లోకి క్షేమంగా చేరగలిగాడు. తాను ఉన్నది భారత్ లో అని తెలిసినా.. అవునా? కాదా? అన్న సందేహం. అలా ప్రయాణిస్తున్న అతడికి దక్షిణాది భాషలు మాట్లాడుకుంటున్న సైనికులు కనిపించిన వెంటనే.. వారిని కేక వేయటం.. వెంటనే వారు అతడికి తుపాకులు గురి పెట్టారు. తన గురించి చినాయ్ చెప్పాడు. గుర్తింపు కార్డులు చూపించమన్నారు. కానీ.. తన వద్ద లేవని.. తాను ఫలానా అని వివరాలు చెబితే.. మొదట నమ్మని వారు.. తర్వాత క్రాస్ చెక్ చేసుకొని ఆశ్చర్యంతో కేరింతలు కొట్టారు.

చినాయ్ క్యాంప్ వద్దకు అతన్ని పంపారు. నిజానికి అతగాడికి ఏదో జరిగిందని వేదనలో ఉన్న అతడి క్యాంప్.. అతగాడి రాకను చూసి చిన్న పండుగే చేసుకున్నారు. యుద్ధం ముగిసింది. ఎంతో సాహసంతో తప్పించుకువచ్చిన మన రాంబో చినాయ్ గురించిన వివరాలు బయటకు రాలేదు. బయటకు రాకుండా ఆర్మీ అధికారులు తొక్కి పెట్టేశారని చెబితే బాగుంటుందేమో.

అనంతరం.. ప్రాణాపాయ పరిస్థితులకు వరకూ వెళ్లి.. రెండుసార్లు మృత్యువు నుంచి తప్పించుకున్న చినాయ్.. సైన్యం నుంచి బయటకు వచ్చాక పైలెట్ గా టాటాలు.. అంబానీలకు పైలెట్ గా వ్యవహరిస్తున్నారు. అత్యంత సాహసోపేతంగా మృత్యువు నుంచి మూడుసార్లు తప్పించుకొచ్చిన చినాయ్ ను.. ఇండియన్ రాంబో అన్నా తప్పేం కాదేమో. చినాయ్ కథనం విన్న వెంటనే.. బాలీవుడ్ సినిమాకు సరిపడా విషయం ఉన్నట్లు కనిపించటం లేదు. ఇలాంటి సాహసికుల సాహసకార్యం.. సినిమాగా వస్తే అదెందరికో స్ఫూర్తి కావటం ఖాయం. మరి.. ఆ పని ఎవరు చేస్తారో చూద్దాం.
Tags:    

Similar News