కాంగ్రెస్‌ ఎమ్మెల్యే:టీడీపీతో లాలూచీ, గులాబీలో చేరిక!

Update: 2016-04-13 07:56 GMT
చెప్పుకోడానికి ఆయన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. ఏదో ఆషామాషీ ఎమ్మెల్యే కూడా కాదు. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో  తెరాస హవా ఎలా ఉన్నప్పటికీ.. మహబూబ్‌ నగర్‌ జిల్లా మక్తల్‌ నియోజకవర్గం నుంచి దాదాపు 50వేలకు పైగా మంచి మెజారిటీతో గెలిచారు. పైగా ఆయన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రి డికె అరుణకు ఆయన సోదరుడు. ఆయన పేరు చిట్టెం రామ్మోహనరెడ్డి. ఆయన బుధవారం నాడు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే ఆయన రాజకీయ ప్రస్థానం గులాబీ పార్టీ దాకా రావడం అనే విషయంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. చిట్టెం రామ్మోహనరెడ్డి సాంప్రదాయంగా కాంగ్రెస్‌ నాయకుడే అయినప్పటికీ.. సుమారు ఏడాది కిందట ఆయన తెలంగాణ తెలుగుదేశం నాయకులతో లాలూచీ అయినట్లుగా బాగా పుకార్లు వచ్చాయి. ఓటుకు నోటు గొడవ రేగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేయడానికి ఎడ్వాన్సులు కూడా పుచ్చుకున్నారని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఈ విషయమై తానే కాంగ్రెస్‌ నేతల్ని హెచ్చరించానని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు కూడా. ఆ ముగ్గురు నేతల్లో చిట్టెం రామ్మోహనరెడ్డి పేరు ఒక్కటే బయటకు వచ్చింది. దీంతో పీసీసీ చీఫ్‌ ఉత్తంకుమార్‌ రెడ్డి  - డీకే అరుణను నిలదీశారు. ఆమె తమ్ముడిని అడగడంతో.. అలాంటిదేమీ లేదని.. తన ఓటు కాంగ్రెస్‌ కే పడుతుందని చిట్టెం చెప్పుకున్నారు. అయితే తెదేపాతో లాలూచీ పడిన నాయకుడు అనే ముద్ర పుకారు రూపంలో ఆయన మీద మిగిలిపోయింది.

ఏడాది తర్వాత మళ్లీ ఆయన వార్తల్లో వ్యక్తి అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయని అంటూ వాటికి మద్దతుగానే ఆయన తెరాసలో చేరుతున్నట్లు ప్రకటిస్తున్నారు. అది కూడా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయసింగ్‌.. హైదరాబాదుకు వచ్చి.. పార్టీ వీడి వెళుతున్న వారిని రెచ్చగొట్టేలా కొన్ని డైలాగులు సంధించి వెళ్లిన మరురోజే ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహనరెడ్డి ఫిరాయింపు నిర్ణయం తీసుకోవడం బహుశా యాదృచ్ఛికమే కావొచ్చు.
Tags:    

Similar News