శాండ్‌ విచ్ క‌క్కుర్తి...10 కోట్ల జీతం హుష్ కాకి!

Update: 2020-02-05 03:30 GMT
ఓ సినిమాలో హీరోయిన్‌ కు త‌న‌కు న‌చ్చిన ఫుడ్ ఐట‌మ్ కొనుక్కొచ్చి తిన‌డం క‌న్నా....కొట్టుకొచ్చి తిన‌డం ఇష్ట‌మ‌ని హీరోకు చెబుతుంది. ఇక ఆ హీరోయిన్‌ను ఇంప్రెస్ చేయ‌డానికి మ‌న హీరో.....బైక్ పై వెళుతూ జామ‌కాయ‌లు దొంగ‌త‌నం చేసి హీరోయిన్ కు ఇవ్వ‌గానే ఇంప్రెస్ అయిపోతుంది. ఇక‌, హోట‌ల్‌ లో టెక్నిగ్‌ గా బిల్లు ఎగ్గొట్టే హీరోల‌కు హీరోయిన్లు ప‌డిపోయే స‌న్నివేశాలు కోకొల్ల‌లు. అయితే, ఇవన్నీ సినిమాల‌కే ప‌రిమితం అని గ్ర‌హించని ఓ బ్యాంక్ మేనేజ‌ర్ క‌క్కుర్తి అత‌డి ఉద్యోగానికే ఎస‌రు పెట్టింది. సాండ్ విచ్ కోసం క‌క్కుర్తి ప‌డ్డ ఆ మేనేజ‌ర్ ఏటా ప‌దికోట్ల రూపాయ‌లు వ‌చ్చే ఉద్యోగాన్ని వదులుకున్న వైనం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

పుర్రెకో బుద్ధి ...జిహ్వ‌కో రుచి....అన్నారు పెద్ద‌లు. యూరప్‌లో ‘సిటీ గ్రూప్‌’ బ్యాంక్‌ లో సీనియర్‌ మేనేజర్‌ గా పనిచేస్తున్న పరాశ్‌ షా ఈ సామెత‌ను బాగా వంట‌బ‌ట్టించుకున్నారు. అందుకే, త‌న పుర్రెలో పుట్టిన పాడు బుద్ధితో జిహ్వ చాప‌ల్యాన్ని తృప్తి ప‌రచాల‌నుకున్నారు. ఏటా దాదాపు ప‌ది కోట్ల జీతం అందుకునే షా...శాండ్ విచ్ కోసం క‌క్కుర్తి ప‌డ్డారు. లండన్‌లోని కానరీ వార్ఫ్‌ లో ఉన్న బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం నుంచి తరచుగా షా ఆహారాన్ని దొంగలిస్తున్నారట. ఒన్ ఫైన్ డే ఈ విష‌యం తెలుసుకున్న యాజమాన్యం షాను సస్పెండ్‌ చేసింది. దీంతో షాపై నెటిజ‌న్లు స‌ర‌దాగా సెటైర్లు వేస్తున్నారు. శాండ్ విచ్ కు క‌క్కుర్తిప‌డి.....బంగారంలాంటి ఉద్యోగం...ప‌రువు పోగొట్టుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ త‌ర‌హాలో స‌స్పెండ్ అయిన బ్యాంక‌ర్లు మ‌రి కొంద‌రున్నారు. బైక్‌ నుంచి 500 రూపాయల విలువైన‌ ఓ పార్ట్ కొట్టేసిన‌ లండన్ బ్యాంక‌ర్ - టిక్కెట్లు తీసుకోకుండా రైల్లో ప్రయాణించి దొరికిపోయిన మ‌రో బ్యాంక‌ర్ ఇలా...క‌క్కుర్తిప‌డి ఇక్క‌ట్ల పాల‌య్యారు.


Tags:    

Similar News