కేంద్రాన్ని ఇరికించిన జ‌గ‌న్‌.. ఇక‌, సోముకు చేతినిండా ప‌నే!

Update: 2022-07-28 00:30 GMT
ఔను! ఇప్పుడు ఇదే విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు.. కేంద్రాన్ని గ‌ట్టిగానే ఇరికించాయని అంటున్నారు ప‌రిశీల‌కులు. గోదావ‌రి జిల్లాల్లో ఇటీవ‌ల పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన ప్రాంతాల్లో సీఎం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పోల‌వ‌రం.. ముంపు ప్రాంతాల బాధితుల‌తో మాట్లాడుతూ.. కేంద్రాన్ని గ‌ట్టిగానే ఇరికించారు. కేంద్రం డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌ని.. ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం తరపున వరదసాయం అందించగలమని చెప్పారు.

అంతేకాదు.. 500 కోట్లు, వెయ్యి కోట్లు అయితే తన చేతిలో ఉంటుందని, కేంద్రం నిధులు ఇస్తేనే పోల‌వ‌రం ముంపు ప్రాంతాల్లోని వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ  అమలు చేయగలమని ముఖ్య‌మంత్రి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. రూ. 20 వేల కోట్లు ఇక్క‌డ ఇవ్వాల్సి ఉంటుంద‌ని.. అయితే.. అంత మొత్తం తన చేతిలో ఎక్కడ ఉంటుంది? అని ప్రశ్నించారు. వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి... ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతామని పేర్కొన్నారు. స్వయంగా ప్రధాని మోడీని కలిసి సమస్యలు వివరిస్తానని ప్రకటించారు.

వరద బాధితులు తమను తిట్టుకుంటున్నారని కూడా ప్రధానికి చెబుతానని చెప్పారు. త్వరగా ఆర్థిక సాయం అందించాలని మోడీకి విజ్ఞప్తి చేస్తానని ప్రకటించారు. బాధితులకు సాయం ఎప్పటికైనా ఇవ్వక తప్పదు కదా అని వైరాగ్యంతో మాట్లాడారు. సాయం త్వరగా అందిస్తే అంతా సంతోషపడతారని ప్రధానికి చెబుతానని సీఎం వివరించారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ అడిగానని, పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. పరిహారం ఇస్తేనే ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుతామని, సెప్టెంబర్‌ నాటికి పరిహారం, పునరావాసం కల్పిస్తామని జగన్‌ హామీ పడ్డారు.

కేంద్రం ఏం చెబుతోంది?

అయితే.. జ‌గ‌న్ చెప్పిన దానికి ఎక్క‌డా పొంతన కుద‌ర‌డం లేద‌ని.. పోల‌వ‌రం విష‌యాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్న‌వారు చెబుతున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను మాత్ర‌మే తాము తీసుకుంటామ‌ని.. ఇక్క‌డ భూములు ఇచ్చిన నిర్వాసితుల‌కు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో త‌మ‌కు సంబంధం లేద‌ని.. గ‌త నాలుగేళ్లుగా కేంద్ర ప్ర‌భుత్వం చెబుతూనే ఉంది. అంటే.. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట‌లు.. కేంద్రం చెప్పిన మాట‌ల‌తో పోలిస్తే.. పొంత‌న కుద‌ర‌డం లేద‌ని నిపుణులు చెబుతున్నారు.

నిజంగానే కేంద్రం ఇవ్వాల్సి ఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ఇవ్వ‌లేదో.. కూడా సీఎం క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. ఆర్ అండ్ ఆర్ అంతా కూడా.. రాష్ట్రాలే భ‌రించాల‌ని.. గ‌తంలోనే 14వ ఆర్థిక సంఘం సూచించిన‌ట్టు కేంద్రం స్ప‌ష్టం చేసింద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా..జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో కేంద్రం వైపు వేలు చూపించిన‌ట్టు అయింది. దీనిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రియాక్ష‌న్ కీల‌కంగా మారింది.
Tags:    

Similar News