మండుటెండలను సైతం లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో ప్రజాసంక్షేమ యాత్రను వైసీపీ అధ్యక్షుడు జగన్ దిగ్విజయంగా కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. మడమ తిప్పని మాట తప్పని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే ఆయన తనయుడు జగన్ కూడా పయనిస్తూ వేల కిలోమీటర్ల మేర చేపడుతోన్న పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్న విషయం విదితమే. జిల్లాతో...ప్రాంతంతో సంబంధం లేకుండా జగన్ అడుగులో అడుగేసేందుకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉత్సాహం చూపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జగన్ ను విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి కలిసి ఆయన యాత్రకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా, టాలీవుడ్ స్టార్ కమెడియన్ పృథ్వీ రాజ్....జగన్ ను కలిసి మద్దతు తెలిపారు. వైసీపీ కండువా మెడలో వేసుకొని....వైసీపీ జెండా భుజాన మోస్తూ జగన్ అడుగులో అడుగేసుకుంటూ ఆయన వెంట నడిచారు.
జగన్ పాదయాత్రకు రాష్ట్ర నలుమూలల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ వెంట నడిచేందుకు మండుటెండలను కూడా లెక్కచేయకుండా జనం స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. జననేతకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా జగన్ ను కమెడియన్ పృథ్వీ కలిసి తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాదయాత్రకు ప్రజాస్పందన వెల్లువెత్తుతోందని పృథ్వీ అన్నారు. నిప్పులు చెరుగుతోన్న ఎండను కూడా లెక్కచేయకుండా జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారని అన్నారు. ప్రజా సేవ చేయాలనే సంకల్పమే ఆయనను ముందుకు నడిపిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీదే అధికారమని పృథ్వీ అన్నారు. పేదల కష్టాలు తెలిసిన వాడే నిజమైన నాయకుడని, వైఎస్ తర్వాత జననేత జగన్ కు మాత్రమే ఈ తరహా పాదయాత్ర సాధ్యమని అన్నారు. కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ వారధి ఊగిపోయిందంటే జగన్ కు ఏ స్థాయిలో జనాదరణ వస్తోందో అర్ధమవుతోందన్నారు. తనకు తెలిసిన మహాయోధులు ఎన్టీఆర్ - వైఎస్ ఆర్ మాత్రమేనని, తాను చూసిన గొప్ప ముఖ్యమంత్రులు వారిద్దరేనని అన్నారు. వారి తర్వాత అంతటి ఘనత జగన్ కే సాధ్యమని ప్రశంసలతో ముంచెత్తారు.