రాహుల్ ఆలింగనం..చిప్‌ కో ఉద్యమం

Update: 2018-07-20 13:40 GMT
కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రధాని మోదీని ఆలింగనం చేసుకోవడం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా ``నాపై మీకు ద్వేషం ఉండొచ్చు.. నేను మీకు పప్పునే కావచ్చు. కానీ నాకు మాత్రం మీపై ప్రేమనే ఉంది అంటూ తన ప్రసంగాన్ని ముగించి నేరుగా మోడీ దగ్గరికి రాహుల్ వెళ్లారు. అది చూసి చాలా మంది ఆయన ఏం చేయబోతున్నారోనని ఆసక్తిగా చూశారు. ట్రెజరీ బెంచుల్లోని సభ్యులు లేచి నిలబడ్డారు. రాహుల్ మొదట వెళ్లి మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత సడెన్‌గా ఆయనను ఆలింగనం చేసుకోవడంతో అందరూ షాక్ తిన్నారు. రాహుల్ తీరుపై ఇటు స‌భ‌లో...అటు సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

కాగా, రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రధాని మోడీని ఆలింగనం చేసుకోవడం పట్ల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ సభలో చిప్‌కో ఉద్యమాన్ని మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు. రాహుల్ ప్రవర్తన సరిగాలేదన్నారు. వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గేను తాను ఆలింగనం చేసుకోబోనున్నట్లు రాజ్‌నాథ్ చెప్పారు. మ‌రోవైపు రాహుల్ గాంధీ ప్రవర్తనను స్పీకర్ సుమిత్రా మహాజన్ తప్పుబట్టారు. తన ప్రసంగం చివరలో ప్రధాని మోడీ వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకోవడం, ఆ తర్వాత ఆయన కన్ను కొట్టడం సభా సంప్రదాయాలను ఉల్లంఘించడమేనని స్పీకర్ పేర్కొన్నారు. సభా హుందాతనానికి రాహుల్ గాంధీ మచ్చ తెచ్చారని ఆమె చెప్పారు. `రాహుల్ తన కొడుకులాంటి వాడు.. అతను ప్రవర్తించిన తీరులో తప్పుల్పి చూపడం తన బాధ్యత` అని స్పీకర్ తెలిపారు. సభాధ్యక్షుడి హోదాలో ప్రధాని పదవిలో ఉన్న మోదీ వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం, మళ్లీ వచ్చి కన్నుకొట్టడం సభ హుందాతనం కాదని సుమిత్ర మహాజన్ చెప్పారు. సభా గౌరవాన్ని కాపాడాల్సింది సభ్యులే అని స్పీకర్ స్పష్టం చేశారు. సభలో లేని కొత్త సంప్రదాయాలను రాహుల్‌కు మల్లిఖార్జున్ ఖర్గే నేర్పిస్తున్నారని స్పీకర్ సుమిత్రా మహాజన్ చురకలు అంటించారు. ప్రధానిని కౌగిలించుకొని, కన్నుకొట్టిన తర్వాత కూడా ప్రసంగం మొదలు పెట్టడం కూడా తప్పేనని స్పీకర్ పేర్కొన్నారు.

మ‌రోవైపు రాహుల్ అలింగ‌నం ఘటనపై ట్విటర్‌లో ఇప్పుడు జోకులు పేలుతున్నాయి. సాధారణంగా మోడీ ఏ దేశానికి వెళ్లినా, వేరే దేశాధ్యక్షులు ఇండియాకు వచ్చినా.. ఆలింగనం చేసుకొని ఆహ్వానం పలుకుతారు. ఇప్పుడు రాహుల్ దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ హైలైట్‌గా మారింది. `రాబోయే ఎన్నిక‌ల్లో న‌న్ను గెలిపించండి` అని మోడీని రాహుల్ కోరుతున్నార‌ని ఓ నెటిజ‌న్ సెటైర్ వేశారు.
Tags:    

Similar News